Share News

వంశీపై కేసులో అదనపు సెక్షన్లు చేరాయి

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:33 AM

వంశీ తరఫున న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మైనింగ్‌ యాక్ట్‌ కింద పిటిషనర్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు.

వంశీపై కేసులో అదనపు సెక్షన్లు చేరాయి

  • అవి ఏడేళ్లకుపైగా శిక్షకు వీలున్నవే

  • పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వండి

  • హైకోర్టును అభ్యర్థించిన హోంశాఖ జీపీ

  • విచారణ సోమవారానికి వాయిదా

అమరావతి/గన్నవరం/విజయవాడ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): అక్రమ మైనింగ్‌కి సంబంధించి నమోదు చేసిన కేసుల్లో బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొనేలా కృష్ణాజిల్లా, గన్నవరం పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైసీపీనేత వల్లభనేని వంశీ హైకోర్టులో వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లపై గురువారం విచారణ జరిగింది. వంశీ తరఫున న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మైనింగ్‌ యాక్ట్‌ కింద పిటిషనర్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొనేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. హోంశాఖ ప్రభుత్వ న్యాయవాది జయంతి స్పందిస్తూ.. వంశీపై నమోదు చేసిన కేసులలో పోలీసులు అదనపు సెక్షన్లు చేర్చారన్నారు. అవన్నీ ఏడేళ్లు పైబడి శిక్షకు వీలున్నవేనన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. వంశీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అదనపు సెక్షన్లు చేర్చలేదన్నారు.


ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ విచారణను ఈనెల 17కి వాయిదా వేశారు. కాగా, వంశీపై గన్నవరం 8వ అడిషనల్‌ జ్యూడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ కోర్టులో రెండు పీటీ వారెంట్‌లను గురువారం పోలీసులు దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో వంశీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై గురువారం వాదనలు జరిగాయి. వంశీ న్యాయవాది సత్యశ్రీ తన వాదనలను వినిపించారు. వాదనల అనంతరం న్యాయాధికారి హిమబిందు తదుపరి వాదనలను ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. కాగా, ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో ఉన్న వల్లభనేని వంశీ కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కోర్టులో 400కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 14 , 2025 | 04:33 AM