Share News

AP High Court: ప్రతి చిన్న విషయానికీ హైకోర్టుకా

ABN , Publish Date - May 21 , 2025 | 03:03 AM

రాజకీయ పార్టీలు ప్రతి చిన్న విషయాన్నీ హైకోర్టుకు తెస్తూ న్యాయవ్యవస్థను క్రీడామైదానంగా మార్చారంటూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరువూరు చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా భద్రత కోరుతూ వేసిన పిటిషన్‌పై విచారణలో కోర్టు... పిటిషనర్లు తప్పు చేస్తే రూ.10లక్షల జరిమానా విధిస్తామంటూ హెచ్చరించింది.

AP High Court: ప్రతి చిన్న విషయానికీ హైకోర్టుకా

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్థాయిని

సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ స్థాయికి దిగజార్చారు

కోర్టులను క్రీడా మైదానాలుగా మార్చారు

మీ మధ్య సిల్లీ వివాదాలు తీర్చడానికి

మేమిక్కడ లేము: హైకోర్టు

రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు

వ్యవస్థ దుర్వినియోగంపై ఆగ్రహం

ఆదేశాలు అమలు చేయకుంటే కానిస్టేబుల్‌ నుంచి

డీజీపీ వరకూ ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరిక

పిటిషనర్ల తప్పుందని తేలితే 10 లక్షల జరిమానా విధిస్తాం

తిరువూరు కౌన్సిలర్లకు భద్రత వ్యవహారంలో కీలక ఆదేశాలు

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): గత ఐదారేళ్లలో రాజకీయ పార్టీలు ప్రతి చిన్న విషయాన్నీ హైకోర్టుకు తీసుకొచ్చి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్థాయిని సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ స్థాయికి దిగజార్చాయని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రెండు రాజకీయ పార్టీలు తమ మధ్య ఉన్న సమస్యలను కోర్టులకు తీసుకొచ్చి న్యాయస్థానాలను క్రీడా మైదానాలుగా మార్చాయని, ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని వ్యాఖ్యానించింది. కోర్టులో షో చేయవద్దని హెచ్చరించింది. ప్రతీ ఒక్కరూ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. తిరువూరు నగర పంచాయితీ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా భద్రత కల్పించాలని కోరుతూ వైసీపీ కౌన్సిలర్లు వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. భద్రత అవసరమైన కౌన్సిలర్లు పోలీసులకు వినతి సమర్పించాలని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చామని, తమ ఆదేశాలకు అనుగుణంగా వినతిపత్రం ఎందుకు సమర్పించలేదని పిటిషనర్లను ప్రశ్నించింది. తాము ఇచ్చిన ఆదేశాలు పోలీసులు అమలు చేయలేదని గుర్తిస్తే కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు ఎవరినీ ఉపేక్షించబోమని, వారిని శిక్షించడానికి కూడా వెనుకాడబోమని వ్యాఖ్యానించింది. అవసరమైతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభిస్తామని పేర్కొంది. పిటిషనర్ల వైపు నుంచి తప్పు ఉందని తేలితే రూ.10లక్షలు జరిమానా విధించి వ్యాజ్యాలు కొట్టివేస్తామని హెచ్చరించింది. కోర్టులతో ఆటలాడొద్దని, మీ మధ్యన ఉన్న సిల్లీ వివాదాలు పరిష్కరించడానికి ఇక్కడ లేమని ఘాటుగా స్పందించింది. తమ ఆదేశాల అమలుకు సంబంధించిన నివేదికను తదుపరి విచారణలో తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.


వాదనలు సాగాయిలా...

తిరువూరు నగర పంచాయితీ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా ఓటర్లు అందరికీ తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైసీపీ కౌన్సిలర్లు మోదుగు ప్రసాద్‌, గుమ్మా వెంకటేశ్వరి సోమవారం అత్యవసరంగా హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది పపుడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నెల 19న చైర్మన్‌ ఎన్నికలో పాల్గొనకుండా కౌన్సిలర్లను అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారని, చైర్మన్‌గా పోటీ చేయబోతున్న వ్యక్తిని సీఐ, డీఎస్పీ నిర్బంధించడంతో ఎన్నిక 20వ తేదీకి వాయిదా పడిందని వివరించారు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని రాష్ట్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. శాంతి భద్రతల సమస్య కారణంగా కౌన్సిలర్లు హోటల్లో ఉంటున్నారని, హోటల్‌ నుంచి ఎన్నిక జరిగే హాలు వరకు భద్రత కల్పించాలని కోరామని చెప్పారు. తాము సమర్పించిన వినతులను పోలీస్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌కు ఈసీ పంపిందని పేర్కొన్నారు. అయితే కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్తేనే భద్రత కల్పిస్తామని సీఐ, డీఎస్పీ చెబుతున్నారని తెలిపారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది జయంతి వాదనలు వినిపిస్తూ... భద్రత కల్పించాలని కోరుతూ పిటిషనర్లు పోలీసులకు ఎలాంటి వినతిపత్రం అందజేయలేదని స్పష్టం చేశారు.


ఈ నెల 16న ఇదే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం భద్రత కల్పించాలని కోరుతూ పోలీసులకు వినతి సమర్పించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఎన్నికల సంఘానికి వినతి ఇస్తే సరిపోదని తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. పోలీసులకు వినతిపత్రం ఎందుకు సమర్పించలేదని పిటిషనర్లను ప్రశ్నించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బదులిస్తూ.. స్థానిక సీఐ వ్యవహార శైలిపై తమకు అభ్యంతరం ఉందన్నారు. కౌన్సిలర్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సీఐ పేరు ఏమిటని ప్రశ్నించారు. సీఐ గిరిబాబు, డీఎ్‌సపీ ప్రసాదరావు అని న్యాయవాది బదులిచ్చారు. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదని జీపీ వాదించారు. పోలీసుల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పిటిషనర్లు వారి ఇంటి వద్ద ఉంటే రక్షణ కల్పించగలమని, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో కూడా పోలీసులకు తెలియదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది ఆకాశ్‌ వాదనలు వినిపిస్తూ... ఎన్నికల సంఘానికి సమర్పించిన వినతిని రాష్ట్ర డీజీపీ, పోలీస్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌కు, మున్సిపల్‌ కమిషనర్‌కు ఫార్వర్డ్‌ చేశామని తెలిపారు.


న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల కమిషనర్‌ పంపిన వినతిపై డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు పోలీసులకు సరిపోవా? అసలేం జరుగుతోందని నిలదీశారు. పిటిషనర్లు ఎక్కడున్నారో తెలియదని సామాన్య ప్రజలు చెబితే అర్థం చేసుకోగలమన్నారు. పోలీసులకు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఉంది కదా? అని ప్రశ్నించారు. కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ఆరా తీశారు. పదిమంది కౌన్సిలర్లు రామవరప్పాడులోని ఓ హోటల్‌లో, మరో కౌన్సిలర్‌ మంజుల తిరువూరులోని శాంతినగర్‌లో ఉన్నారని ఆయన బదులిచ్చారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. చైర్మన్‌ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వీలుగా కోర్టును ఆశ్రయించిన ఇద్దరు పిటిషనర్లతో పాటు మరో 9మంది కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. పోలీసుల రక్షణ ఆసరాగా తీసుకొని ఏమైనా అక్రమాలకు పాల్పడితే కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించడంతో పాటు రూ.10లక్షల జరిమానా విధిస్తామని పిటిషనర్లను హెచ్చరించారు. ప్రతి చిన్న విషయానికీ కోర్టు మెట్లు ఎక్కేవారికి ఇదో గుణపాఠం అవుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 03:03 AM