న్యాయవ్యవస్థపై జస్టిస్ కృపాసాగర్ చెరగని ముద్ర
ABN , Publish Date - Jun 19 , 2025 | 06:54 AM
హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నేతృత్వంలో బుధవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
30 ఏళ్లుగా సేవలందించారు: సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
పదవీ విరమణ సందర్భంగా హైకోర్టులో ఘనంగా వీడ్కోలు
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నేతృత్వంలో బుధవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ కృపాసాగర్ అందించిన న్యాయసేవలను ఈ సందర్భంగా సీజే కొనియాడారు. ఎంతో ఓపిక, సహనంతో ఇరువైపుల వాదనలు విని నిర్ణయాన్ని వెల్లడిస్తారనే మంచి పేరు తెచ్చుకున్నారని, న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా వివిధ హోదాల్లో 30 ఏళ్లకుపైగా న్యాయవ్యవస్థకు సేవలందించి చెరగని ముద్రవేశారని తెలిపారు.
జస్టిస్ కృపాసాగర్ మాట్లాడుతూ వృత్తి జీవితం ఎంతో సంతృప్తిని, మధురస్మృతులను అందించిందన్నారు. సుదీర్ఘ వృత్తి జీవితంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆయన ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించారని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం కొనియాడారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలోనూ జస్టిస్ కృపాసాగర్ దంపతులను ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. అలాగే, హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు, కార్యవ ర్గం ఆధ్వర్యంలో జస్టిస్ కృపాసాగర్‌ను సన్మానించి జ్ఞాపికను అందజేశారు.