Senar cyclone threat: సెన్‌యార్‌తుఫాన్ ముప్పు!
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:44 AM
రాష్ట్రంలో వరి, పత్తి రైతుల్లో మరో తుఫాను గుబులు రేపుతోంది. గత నెల మొంథా తుఫాన్ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావంతో ఈనెల 26వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో...
24కు వాయుగుండంగా, 26కు తుఫాన్‌గా మారే చాన్స్
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
29 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
కోతకు వచ్చిన పంటను భద్రపర్చుకోండి
రైతులకు ఐఎండీ సూచన
విశాఖపట్నం/అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరి, పత్తి రైతుల్లో మరో తుఫాను గుబులు రేపుతోంది. గత నెల మొంథా తుఫాన్ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావంతో ఈనెల 26వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. గురువారం మలక్కా జలసంధి, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈనెల 24వ తేదీకల్లా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌గా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
తుఫాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సూచించిన ‘సెన్‌యార్’గా నామకరణం చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎండీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గురువారం నాటి వాతావరణ పరిస్థితుల మేరకు ఈనెల 24వ తేదీ నుంచి తమిళనాడులో వర్షాలు ప్రారంభమవుతాయి. ఈనెల 26వ తేదీ నుంచి 29 వరకు తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తరకోస్తాలో వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు పలుచోట్ల భారీ, అక్కడక్కడ అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని మోడళ్లు, కోస్తా, రాయలసీమ మొత్తం వర్షాలు కురుస్తాయని మరికొన్ని మోడళ్లు అంచనా వేశాయి. ఈనెల 28వ తేదీన దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని రాయలసీమ జిల్లాలు, 29న నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా, రాయలసీమలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు.
ఉత్తరాదిలో చలిగాలుల ప్రభావం, బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావం తుఫాన్‌పై ఉంటుందని మరో వాతావరణ నిపుణుడు వివరించారు. తుఫాన్ కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఉత్తరాది నుంచి వీచే చలిగాలులు ప్రభావం చూపుతాయని, అప్పుడు తీరం దాటే ప్రాంతంలో మార్పులు ఉంటాయని తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని స్పష్టంచేశారు. వరి, పత్తి ఇతర పంటల రైతులను ఐఎండీ అప్రమత్తం చేసింది. కోతకు వచ్చిన వరిని కోసి నూర్పించడం, కుప్పలు పెట్టుకోవడం చేయాలని సూచించింది. పొలాల్లో కుప్పలను భద్రపరుచుకోవాలంది.
కాగా, వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ధాన్యం తడవకుండా సురక్షితం చేసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కాగా బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు వీస్తున్నందున శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గురువారం రాష్ట్రంలో చలి ప్రభావం కొనసాగింది. జంగమహేశ్వరపురంలో 14.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇవి కూడా చదవండి...
పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు
తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ జూనియర్