Weather Alert : మండుతున్న ఎండలు నేడు కోస్తాలో తీవ్ర వడగాడ్పులు
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:12 AM
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి.

అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. శనివారం కూడా పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో లో 41.8, ప్రకాశం జిల్లా దరిమడుగు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 41.7, కడప జిల్లా మద్దూరు, ఖాజీపేటలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు వడగాడ్పులు తోడయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 19 మండలాల్లో తీవ్రంగా, 54 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. ఆదివారం కోస్తా ప్రాంతంలో 45 మండలాల్లో తీవ్రంగా, 185 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం 34 మండలాల్లో తీవ్రంగా, 171 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు ఉంటాయని అంచనా వేసింది.