Heat Intensifies: కోస్తాలో పెరిగిన ఎండ
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:10 AM
కోస్తాలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో శుక్రవారం ఎండ తీవ్రత కొనసాగింది. ఉక్కపోత కూడా తోడవ్వడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు..
విశాఖపట్నం, జూన్ 20(ఆంధ్రజ్యోతి): కోస్తాలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో శుక్రవారం ఎండ తీవ్రత కొనసాగింది. ఉక్కపోత కూడా తోడవ్వడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 40.7, తిరుపతిలో 39.6, బాపట్లలో 39.3, నరసాపురంలో 39.2, కావలి, నెల్లూరుల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల ఈదురు గాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని, కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.