Share News

Godavari Tragedy: ఘొల్లుమన్న గోదారి లంక

ABN , Publish Date - May 28 , 2025 | 04:40 AM

సలాదివారిపాలెంలో గోదావరిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులలో ఏడుగురి మృతదేహాలు బయటపడ్డాయి. గాలింపు చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కీలకపాత్ర పోషించి మృతదేహాల వెలికితీతలో విజయం సాధించింది.

Godavari Tragedy: ఘొల్లుమన్న గోదారి లంక

స్నానానికి వెళ్లినవారు విగతజీవులుగా తేలారు

ఏడుగురి మృతదేహాలు లభ్యం.. ఇంకా దొరకని ఒకరి ఆచూకీ

కోనసీమ జిల్లా సలాదివారిపాలెం తీరంలో మిన్నంటిన రోదనలు

(కాకినాడ/అమలాపురం, ఆంధ్రజ్యోతి)

గోదావరి తీరం ఘొల్లుమంది. కన్నబిడ్డలను కోల్పోయిన తల్లుల కడుపు కోత వేదనలతో ఘోషించింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలోని సలాదివారిపాలెంవద్ద గోదారి పాయలో సోమవారం స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు కొట్టుకుపోయిన ఘటనలో ఏడుగురి మృతదేహాలు మంగళవారం బయటపడ్డాయి. మృతులను వడ్డి మహేష్‌(14), సబ్బతి పాల్‌ అభిషేక్‌(18), ఎలిపే మహేష్‌(14), వై.సాయి మహేష్‌(18), కె.రోహిత్‌(18), తాతపూడి నితీష్‌(18), వడ్డి రాజే్‌ష(14)గా గుర్తించారు. ముమ్మిడివరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.

నీటిపై ఒత్తిడి తెచ్చి.. ఫలించిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కృషి..

రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌, ఎస్పీని అప్రమత్తం చేయడంతో స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. అంతకుముందే మత్స్యకారులు, గజఈతగాళ్లను దించి గాలింపు చర్యలు చేపట్టారు. వ బోట్లలో జనరేటర్లను ఉంచి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఎంత అన్వేషించినా ఫలితం రాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గతంలో తవ్వేసిన ఇసుక గోతుల్లో మృతదేహాలు చిక్కుకుపోయి ఉంటాయని అనుమానించి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. రెండు స్పీడ్‌బోట్లతో చాలా వేగంగా గుండ్రంగా రౌండ్లు కొట్టడంతో నీటిపై ఒత్తిడి భారీగా పెరిగి అడుగు నుంచి ఒక్కో మృతదేహం బయటపడుతూ వచ్చింది.


మిన్నంటిన రోదనలు..

మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయానికి ఆరు మృతదేహాలు బయటపడగా వీటిని పోస్టుమార్టం కోసం ముమ్మిడివరం తరలించారు. అయితే, మిగిలిన మృతదేహాలు కూడా వచ్చిన తర్వాతే శవపంచనామా చేయాలని బంధువులు అడ్డుకున్నారు. మరోపక్క తమ బిడ్డలను మృతదేహాలుగా చూసి అక్కడికి వచ్చిన తల్లుల రోదనలకు అంతులేకుండాపోయింది. ముగ్గురి మృతదేహాలకు సంబంధించి ముఖాలను చేపలు తినేయడంతో చాలా వరకు తల ఎదుటి భాగం పాడైపోయి రక్తం కారుతూ కనిపించింది. ఇది చూసి పలువురు తల్లులు తమ చీరతో బిడ్డల ముఖాలను తుడిచిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. కాకినాడకు చెందిన ఓ పాస్టర్‌ ఇద్దరు తనయులు గోదావరి ప్రమాద ఘటనలో గల్లంతవగా, వారిలో ఒకరి మృతదేహం బయటపడింది. దీంతో రెండో మృతదేహం లభించే వరకు పోస్టుమార్టం చేయవద్దని బంధువులు పట్టుబట్టారు. ఒకేసారి పోస్టుమార్టం చేయాల్సిన మృతదేహాలు పెరగడంతో ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం గది ఇరుకుగా మారింది. మృతదేహాల దుర్వాసన నేపథ్యంలో వీటిని బయటే ఉంచి కొబ్బరిచెట్ల చుట్టూ పరదాలు కట్టి శవపంచనామా పూర్తిచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 04:40 AM