Drunk Headmaster: హెచ్‌ఎం సారు.... మందు కొట్టి వచ్చారు!
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:50 AM
పాఠశాలను క్రమశిక్షణలో నిర్వహించాల్సిన ప్రధానోపాధ్యాయుడే గతి తప్పాడు
సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు
కమలాపురం రూరల్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పాఠశాలను క్రమశిక్షణలో నిర్వహించాల్సిన ప్రధానోపాధ్యాయుడే గతి తప్పాడు. ఫుల్లుగా తాగేసి పాఠశాలకు వచ్చాడు. విషయం తెలిసి కలెక్టర్ అతడిని సస్పెండ్ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం పెద్దచెప్పలి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓబుల్‌రెడ్డి మంగళవారం ఫుల్లుగా మద్యం సేవించి మత్తులో తూగుతూనే పాఠశాలకు వచ్చాడు. కుర్చీలో కూర్చుని టేబుల్‌మీద తలపెట్టుకుని పడుకున్నాడు. మద్యం మత్తులో తూగుతున్న ప్రధానోపాధ్యాయుడిని మీడియా ప్రశ్నించగా మద్యం తాగడం తప్ప తాను వేరే తప్పు చేయలేదని సమర్థించుకున్నాడు. ఆయన రోజూ తాగేసి పాఠశాలకు వస్తారని ఇతర ఉపాధ్యాయులు తెలిపారు. అందరూ కలసి ఆయనను పాఠశాల నుంచి నుంచి పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈవో అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులను పిలిపించి ఒక్కొక్కరి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. కాగా.. కమలాపురం మండలం పెద్దచెప్పలి హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు ఓబుల్‌రెడ్డి మద్యం తాగి పాఠశాలకు వెళ్లిన విషయం మీడియాలో రావడంతో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆయనను సస్పెండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డీఈవో ఆదేశించారు.