Share News

హెడ్‌కానిస్టేబుల్‌ మదన్‌ ఆరోపణలపై పోలీసు శాఖ విచారణ

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:45 AM

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణాన్ని వెలికి తీస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు తనను విచారణకు పిలిచి తీవ్రంగా కొట్టారంటూ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై పోలీసు శాఖ విచారణకు ఆదేశించింది.

హెడ్‌కానిస్టేబుల్‌ మదన్‌ ఆరోపణలపై పోలీసు శాఖ విచారణ

  • సిట్‌ అధికారులు కొట్టారని డీజీపీకి ఆయన లేఖ

  • దీని వెనుక కుట్ర దాగుందన్న అధికారులు

  • నిగ్గు తేల్చే బాధ్యత ఐజీ ఆకే రవికృష్ణకు

అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణాన్ని వెలికి తీస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు తనను విచారణకు పిలిచి తీవ్రంగా కొట్టారంటూ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై పోలీసు శాఖ విచారణకు ఆదేశించింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణకు నిజాలు నిగ్గు తేల్చే బాధ్యతను డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా అప్పగించినట్లు తెలిసింది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్‌ అధికారులు.. ఇది తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారమని, దర్యాప్తునకు ఆటంకం కలిగించే కుట్రని, నిజాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు. ఈ నెల 10, 11న విచారణకు వచ్చిన మదన్‌ రెడ్డి తనకు ఛాతీలో నొప్పి వస్తోందంటూ వెళ్లిపోయారు. మరుసటి రోజు(12న) విచారణకు రాకుండా ఆసుపత్రిలో చేరి 13న డిశ్చార్జి అయ్యారు. తనను సిట్‌ అధికారులు తీవ్రంగా కొట్టారని, విచారణకు వెళ్లలేనంటూ డీజీపీకి మదన్‌రెడ్డి లేఖ రాశారు. అవాక్కైన సిట్‌ అధికారులు.. ఈ ఆరోపణల వెనుక కుట్ర దాగుందని, తాము 4సీసీ కెమెరాల మధ్యలో ప్రశ్నించామని, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితో విచారణ జరిపించి తమ తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని, లేకుంటే మదన్‌ రెడ్డిపై తీసుకోవాలని డీజీపీని కోరారు. ఇరువైపుల వినతులను పరిశీలించిన డీజీపీ గుప్తా ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ ఐబీ లాంటి సంస్థల్లో పనిచేసిన ఐజీ ర్యాంకు అధికారి ఆకే రవికృష్ణకు బాధ్యత అప్పగించారు.

Updated Date - Jun 20 , 2025 | 05:48 AM