పచ్చళ్లు, సబ్బులు కొనాల్సిందే!
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:42 AM
గ్రామీణ, పట్ణణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాల సభ్యులను తాము సూచించిన సంస్థ నుంచి పచ్చళ్లు, సబ్బులు, ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేయాలని డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. డ్వాక్రా సంఘాలను పర్యవేక్షించే ఆర్‌పీలు, బుక్ కీపర్‌లకు ఈ బాధ్యతలు అప్పగించారు. లక్ష్యాలను నిర్దేశించి పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. పచ్చళ్లు, సబ్బులు కొనుగోలుకు డ్వాక్రా మహిళలు ముందుకు రావడంలేదని చెబుతున్నా వినిపించుకోకుండా బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. డ్వాక్రా సంఘాల సభ్యులు ఆన్‌లైన్‌లో సబ్బులు, పచ్చళ్లు కొనాల్సిందేనని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో దిక్కుతోచనిస్థితిలో ఆర్‌పీలు, బుక్ కీపర్‌లు ఉన్నారు.

- డ్వాక్రా సంఘాల సభ్యులపై డీఆర్‌డీఏ, మెప్మా ఒత్తిడి
- వావ్ జెనీ యాప్ ద్వారా బుక్ చేయాలని సూచన
- ఆర్‌పీలు, బుక్ కీపర్‌లకు టార్గెట్లు.. పూర్తి చేయాలని ఆదేశాలు
- కొనుగోలుపై ఆసక్తి చూపని డ్వాక్రా సంఘాల సభ్యులు
- దిక్కుతోచనిస్థితిలో ఆర్‌పీలు, బుక్ కీపర్‌లు
గ్రామీణ, పట్ణణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాల సభ్యులను తాము సూచించిన సంస్థ నుంచి పచ్చళ్లు, సబ్బులు, ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేయాలని డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. డ్వాక్రా సంఘాలను పర్యవేక్షించే ఆర్‌పీలు, బుక్ కీపర్‌లకు ఈ బాధ్యతలు అప్పగించారు. లక్ష్యాలను నిర్దేశించి పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. పచ్చళ్లు, సబ్బులు కొనుగోలుకు డ్వాక్రా మహిళలు ముందుకు రావడంలేదని చెబుతున్నా వినిపించుకోకుండా బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. డ్వాక్రా సంఘాల సభ్యులు ఆన్‌లైన్‌లో సబ్బులు, పచ్చళ్లు కొనాల్సిందేనని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో దిక్కుతోచనిస్థితిలో ఆర్‌పీలు, బుక్ కీపర్‌లు ఉన్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లావ్యాప్తంగా డీఆర్‌డీఏ ద్వారా 48,700 డ్వాక్రా సంఘాలు నడుస్తున్నాయి. మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాల్లో మరో తొమ్మిది వేలకుపైగా డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వావ్ జెనీ యాప్‌లో సబ్బులు, పచ్చళ్లు కొనుగోలు చేసేందుకు డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి నగదు వసూలు చేయాలని ఆర్‌పీలు, బుక్‌కీపర్‌లకు ఆదేశాలు ఇచ్చారు. వీటి కొనుగోలుకు ఆన్‌లైన్‌లో లాగిన్ కావాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఎంతమేర సరుకును కొనుగోలు చేస్తున్నారో, ఆర్టర్‌లు ఎంతమేర పెట్టారో లెక్కలు చెప్పాలని వివరాలు కోరుతున్నారు. ఉదాహరణకు మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో 3,600 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. 36,000 మందికిపైగా సభ్యులు ఉన్నారు. వీరు సబ్బులు, పచ్చళ్లలో ఏదో ఒకటి కొనుగోలు చేయాలని, అందుకు అవసరమైన నగదును సభ్యుల నుంచి కట్టించాలని ఆర్‌పీలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ఆర్‌పీలు ఈ పని మావల్ల కావడం లేదని, డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ వస్తువులను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని చెప్పినా పట్టించుకునే స్థితిలో మెప్మా అధికారులు లేరు. గతంలో మెప్మా పీడీ స్థాయి అధికారి ఆర్‌పీలతో అసలు మాట్లాడేవారు కాదని, పురపాలక సంఘాల్లో పనిచేసే అధికారులకు తగు సూచనలు చేసేవారని, పచ్చళ్లు, సబ్బులు కొనుగోలు చేయాలని మెప్మా పీడీ నేరుగా తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆర్‌పీలు వాపోతున్నారు. ఈ పీడీ పనితీరే వేరుగా ఉందని ఆర్‌పీలు చెప్పుకుంటున్నారు.
నగదు వసూలు చేయాలని సలహా
డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి ఆర్‌పీలు, బుక్ కీపర్‌లు నేరుగా నగదు తీసుకునే వెసులుబాటు లేదు. అయితే ఈ పచ్చళ్లు, సబ్బులు కొనుగోలు చేసే విషయంలో ఆర్‌పీలు, బుక్ కీపర్‌లు నేరుగా నగదు తీసుకోవాలని అధికారులు చెప్పడం గమనార్హం. ఆర్‌పీలు, బుక్ కీపర్‌లు ఈ నగదును ఎక్కడి నుంచి తీసుకురావాలనే సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ఆర్‌పీలు సమాఖ్యలో వివిధ రూపాల్లో ఉన్న నగదును తీసి వీటి కొనుగోలు నిమిత్తం చెల్లింపులు చేస్తున్నారు. ఆ తర్వాత ఆడిట్ అభ్యంతరాలు వస్తే ఏం చేయాలో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు.
కనీస అవగాహన కల్పించకుండానే..
డ్వాక్రా సంఘాలకు లక్ష్మి పచ్చళ్లు, గోంగూర, పండు మిరప, నిమ్మ తదితర పచ్చళ్ల సీసాల ఫొటోలను పెట్టి ఒక్కో సీసా ఖరీదు రూ.150గా ముద్రించారు. వీటితోపాటు నేచురల్ శాండల్ ఉడ్ సోప్, నేచురల్ అలోవేరా సోప్, నేచురల్ పాపాయ సోప్, నేచురల్ రెడ్‌వైన్ సోప్, నేచురల్ డి-టాన్ సోప్ ఒక్కొక్కటి రూ.125 ధరగా ఉన్నాయి. వీటి నాణ్యతపై కనీసం అవగాహన కల్పించకుండానే కొనుగోలు చేయాలని చెప్పడంతో పాటు ముందుగా నగదు చెల్లిస్తే ఆ తర్వాత సరుకును ఇస్తామనడం గమనార్హం. ఆన్‌లైన్ మార్కెట్‌లో అనేక యాప్‌ల ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను ఇప్పటికే కొంటున్న పట్ణణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలు అధికారులు సూచించిన సబ్బులు, పచ్చళ్ల ధరలు అధికంగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆర్‌పీలు చెబుతున్నారు. అధికారులు మాత్రం మీకు ఇచ్చిన టార్గెట్‌లను పూర్తి చేయాల్సిందే నని ఆదేశాలు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.