Share News

Harish Kumar Gupta: నూతన డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:12 AM

ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం (31న) పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో గుప్తాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Harish Kumar Gupta: నూతన డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా

విజిలెన్స్‌ డీజీగా ఉన్న ఆయనకు

పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింత

రేపు ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ

ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఆయన్ను

పునర్నియమిస్తూ విడిగా ఆదేశాలు’

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా ఉన్న ఆయనకు ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం (31న) పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో గుప్తాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీగా రిటైరవుతున్న తిరుమలరావు ఏపీఎ్‌సఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా కొనసాగనున్నారు. తొలి ఉత్తర్వుల్లో ఆర్‌టీసీ ఎండీగానూ ఆయన్ను రిలీవ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మళ్లీ ఆ పోస్టులో ఏడాది పాటు నియమిస్తూ సీఎస్‌ వేరుగా ఆదేశాలిచ్చారు. వాస్తవానికి ఆర్‌టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావు కూడా డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గుప్తాకు కూడా అలాగే అదనపు బాధ్యతగాఅప్పగించారు. కొత్త డీజీపీగా ఎంపికైన ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. జమ్మూకశ్మీరుకు చెందిన ఆయన.. న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. 1993 డిసెంబరులో ఖమ్మం ఏఎస్పీగా తొలుత విధుల్లో చేరారు. తర్వాత మెదక్‌, పెద్దపల్లి ఏఎస్పీగా పనిచేశారు. కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల అదపు ఎస్పీగా.. అనంతరం కృష్ణా, నల్లగొండ జిల్లాల ఎస్పీగా విధులు నిర్వహించారు. సమర్థ అధికారిగా పేరుతెచ్చుకున్న ఆయన.. గుంటూరు రేంజ్‌ ఐజీ, శాంతిభద్రతల ఐజీగానూ పనిచేశారు. అయితే జగన్‌ హయాంలో ఆయన్ను అప్రధాన పోస్టులకు పరిమితం చేశారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్‌ తొలగించి.. ఆయన స్థానంలో గుప్తాను డీజీపీగా నియమించింది. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ను విజిలెన్స్‌ డీజీగా బదిలీచేసింది. గుప్తా ఆగస్టు 31న ఆయన పదవీవిరమణ చేయాల్సి ఉంది.

Updated Date - Jan 30 , 2025 | 04:12 AM