Additional Judges : హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరిహరనాథశర్మ, లక్ష్మణరావు
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:09 AM
రాష్ట్ర హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. అదనపు న్యాయమూర్తులుగా న్యాయాధికారులు అవధానం హరిహరనాథశర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో వారిని
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర
ఇద్దరూ రేపు ప్రమాణం చేసే అవకాశం!
అమరావతి/న్యూఢిల్లీ, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. అదనపు న్యాయమూర్తులుగా న్యాయాధికారులు అవధానం హరిహరనాథశర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో వారిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. కొత్త న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం వారిద్దరితో పదవీ ప్రమాణం చేయించే అవకాశం ఉంది. హరిహరనాథశర్మ, లక్ష్మణరావులను పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ ఈ నెల 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం ఆ సంఖ్య 28గా ఉంది. ఈ ఇద్దరి నియామకంతో 30కి చేరింది. కాగా.. రేణుకా యార, నర్సింగ్‌రావు నందికొండ, తిరుమలదేవి, మధుసూదన్‌రావు బొబ్బిలి రామయ్యలను తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించేందుకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
బీఎస్సీ చేసి.. న్యాయ పట్టా
హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. ఆయన స్వస్థలం కర్నూలు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితుడు. కర్నూలు ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన హరిహరనాథశర్మ నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 2007 అక్టోబరులో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. 2017-18 నడుమ అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)గా, 2020-22 మధ్య విశాఖ పీడీజేగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా పనిచేశారు. 2023 నుంచి ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
కంపెనీ, క్రిమినల్ లాలో బంగారు పతకాలు..
డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి. తల్లిదండ్రులు పద్మావతి, వెంకటేశ్వర్లు. ప్రాఽథమిక విద్యను సొంత జిల్లాలో పూర్తి చేసిన ఆయన.. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు పొందారు. 2000లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2014లో జ్యుడీషియల్ సర్వీసులోకి వచ్చారు. మొదట ఏలూరు జిల్లా అదనపు జిల్లా జడ్జిగా పోస్టింగ్ తీసుకున్నారు. ఉమ్మడి కష్ణా జిల్లా పీడీజేగా పనిచేస్తూ 2021 సెప్టెంబరు 2న హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా నియమితులయ్యారు. 2022 అక్టోబరు 22న రిజిస్ట్రార్ జనరల్‌గా నియమితులయ్యారు.