NG Ranga University: గిరిజన శాస్త్రవేత్తపై వేధింపుల పర్వ
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:12 AM
నువ్వో జోకర్‌వి... అయినా నువ్వు తెలుగు మీడియం... నీకు అసలు ఇంగ్లిష్ రాదు.....
విచారణ పేరుతో కమిటీ సభ్యుల దూషణలు
ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీలో అరాచకం
గుంటూరు సిటీ, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘నువ్వో జోకర్‌వి... అయినా నువ్వు తెలుగు మీడియం... నీకు అసలు ఇంగ్లిష్ రాదు కదా? మరి ఇంగ్లి్‌షలో ఎలా ఫిర్యాదు తయారు చేశావ్..? నువ్వేమైనా దేశోద్ధారకుడివా? వీసీపై ఫిర్యాదు చేసి చాలా తప్పు చేశావు. వెంటనే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలి. లేకపోతేనీ బతుకు రోడ్డుపాలే’... ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గిరిజన ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్తకు విచారణ పేరుతో ఎదురైన వేధింపులు ఇవీ. విచారణ పేరుతో తోటి ప్రొఫెసర్లు దూషించడంతో తీవ్ర మానసిక వేదన చెందిన బాధితుడు గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై విచారణ నిర్వహించాలని అక్కడ పనిచేస్తున్న ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ శ్యాంరాజ్ ఆగస్టు 30న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గతరెండేళ్లుగా ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేయకుండానే రూ.వందల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారని, బదిలీలు, పదోన్నతులకు భారీగా నగదు వసూలు చేస్తున్నారని, తన బదిలీకి కూడా డబ్బులు డిమాండ్ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీసీపై విచారణకు గవర్నర్ కార్యాలయం ఇన్‌చార్జి ఆదేశించడంతో సెప్టెంబరు 21న వ్యవసాయ శాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ముందు హాజరు కావాలని శ్యాంరాజ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈనెల 3న విచారణ జరగ్గా.. ముగ్గురు సభ్యుల బృందం ఫిర్యాదుదారుడిని మాటలతో తూలనాడటంతో పాటు ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడికి గురిచేసినట్టు తెలిసింది. దీనిపై గవర్నర్‌కు బాధితుడు మరో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం గుంటూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్యాంరాజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, విచారణ పేరుతో గిరిజన శాస్త్రవేత్తను వేధిస్తున్నారని వర్సిటీ పరిధిలోని శాస్త్రవేత్తలు, ముఖ్య అధికారులు సీఎంవోకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.