హరహర మహాదేవ
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:10 AM
సంధ్యా వేళ.. మంగళవాయిద్యాలు..

వైభవంగా నీలకంఠేశ్వరుడి రథోత్సవం
జనసంద్రమైన ఎమ్మిగనూరు
వేలాదిగా హాజరైన భక్తులు
ఎమ్మిగనూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి): సంధ్యా వేళ.. మంగళవాయిద్యాలు.. భక్తల శివనామస్మరణతో ఎమ్మిగనూరు పట్టణంలోని తేరుబజారు ప్రాంతం మారుమోగింది. రథవీధులు భక్త జనంతో నిండిపోయాయి. వేదపండితులు వేదమంత్రాలను వల్లిస్తుండగా ఆదిదంపతులను భక్తి శ్రద్ధలతో.. వేదమంత్రాలతో మహారథంపై కొలువుదీర్చారు. అందరి చూపు రథం కదలిక వైపే.. అందరి మదిలో భక్తిభావం.. సమయం సాయంత్రం 6:07 గంటలకు రథం ముందుకు సాగింది. ఒక్కసారిగా హరోం..హర.. శంభోశంకరా.. జయహో నీలకంఠేశ్వరా.. అంటూ నినదించారు. రథ చక్రాలు మార్కండేయుడి గుడివైపు 6:15 గంటలకు మార్కండేయుడి సన్నిధానానికి రథం చేరింది. అక్కడ పూజలు చేసి 6:33 గంటలకు రథం యథాస్థానానికి చేరడంతో రథోత్సవం ముగిసింది. మహారథంపై ఆదిదంపతుల ఊరేగింపు కళ్లారా చూసి పులకించాలని, భక్తితో తరించాలని భక్తులు తెలంగాణ, కర్ణాటక రాషా్ట్రల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఎమ్మిగనూరు ప్రజల ఆరాధ్యదైవం నీలకంఠేశ్వరస్వామి మహారథోత్సవం ఆధ్యంతం కన్నుల పండువగా సాగింది. ఉదయం నుంచే ఆలయ నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ధర్మకర్త ఎద్దులింటి మాచాని నీల మురళీధర్ ఆధ్వర్యంలో ఆలయం నుంచి ఉత్సవమూర్తులను పల్లకిలో రథం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అలాగే మేళతాళాలతో గడిగే నాగప్ప కుటుంబీకులు కుంభం తీసుకొచ్చారు. రథం ముందు వేదపండితులు హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణవాసులు, చుట్టుముట్టుగ్రామాల ప్రజలు, భక్తులు తేరుబజారు ప్రాంతానికి చేరుకున్నారు. రథోత్సవం సమయంలో ఏ ప్రమాదం జరుగకుండా ముందుగానే రథవీధులను ట్రాక్టర్లతో దున్ని నీళ్లుపోసి సిద్ధం చేశారు. రథంపై నుంచే పూజారులు హారతి ఇచ్చి వెనక్కి రథం మళ్లించారు. గుమ్మడికాయ బలి ఇవ్వడంతో ఈ పుణ్యకార్యం ముగిసింది. ప్రధానంగా రథంపై కలశం చూసేందుకు నవదంపతులు తరలివచ్చారు.