Pawan Kalyan: రామ్‌చరణ్ నా కొడుకు కాదు.. అంతకంటే.. పవన్ ఎమోషనల్
ABN , Publish Date - Jan 04 , 2025 | 09:35 PM
Pawan Kalyan: సినిమా టికెట్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్, సప్లయ్ ఆధారంగానే టికెట్ ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ల రేట్ల పెంపుపై సమాజంలో ఒక అపవాదు ఉందని అన్నారు.

రాజమండ్రి: సినిమా టికెట్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరిజిల్లా కడియం మండలం వేమగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న లేఅవుట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(శనివారం) సాయంత్రం 6 గంటలకు జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. హీరో రామ్ చరణ్, మూవీ టీం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగించారు. డిమాండ్, సప్లయ్ ఆధారంగానే టికెట్ ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ల రేట్ల పెంపుపై సమాజంలో ఒక అపవాదు ఉందని అన్నారు. టికెట్ల ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని తేల్చిచెప్పారు. ప్రతీ టికెట్ నుంచి ప్రభుత్వానికి 18శాతం జీఎస్టీ వస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వం భీమ్లానాయక్ చిత్రానికి టికెట్ ధర పెంచలేదని చెప్పారు. చిత్రపరిశ్రమకు రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధే మన నినాదమని తెలిపారు. ‘‘నేను అయినా.. రామ్‌చరణ్ అయినా చిరంజీవి తర్వాతే’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
చిరంజీవి ఆశీస్సుల వల్లే ఇలా ఉన్నామని అన్నారు. నేనెప్పటికీ మూలాలు మర్చిపోనని వెల్లడించారు. తండ్రి మెగాస్టార్.. రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్ అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ఒక హీరోను ద్వేషించడం తమకు తెలియదని వ్యాఖ్యానించారు. అందరూ బాగుండాలని కోరుకుంటామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపాలన్నారు. చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ రావాలని చెప్పారు. సినిమా టికెట్ల ధరల పెంపు కోసం హీరోలతో పనిలేదని తెలిపారు. సినీ పరిశ్రమపై తమ ప్రభుత్వానికి గౌరవం ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు చిత్ర పరిశ్రమను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని పవన్ కల్యాణ్ తెలిపారు.