Share News

Gummanuru Jayaram: అసత్యాలు ప్రసారం చేస్తే పట్టాలపై పడుకోబెడతా

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:12 AM

గుంతకల్లు దోనిముక్కల రోడ్డులోని జగనన్న కాలనీని మంగళవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా... తన గురించి ఓ న్యూస్‌ చానల్‌లో వచ్చిన ఓ కథనంపై ఆయన తీవ్ర స్వరంతో స్పందించారు.

Gummanuru Jayaram: అసత్యాలు ప్రసారం చేస్తే పట్టాలపై పడుకోబెడతా

గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం తీవ్ర వ్యాఖ్యలు

ఓ న్యూస్‌ చానల్‌ను ఉద్దేశించే అన్నట్టు వివరణ

గుంతకల్లు, అమరావతి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అసత్య కథనాలను తనపై ప్రసారం చేస్తున్నారని, వాటిని నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెట్టడానికి కూడా వెనుకాడనంటూ అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంతకల్లు దోనిముక్కల రోడ్డులోని జగనన్న కాలనీని మంగళవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా... తన గురించి ఓ న్యూస్‌ చానల్‌లో వచ్చిన ఓ కథనంపై ఆయన తీవ్ర స్వరంతో స్పందించారు. ‘‘నా అనుచరులు, బంధువులు ఎవరినో రైలు పట్టాలపై పడుకోబెట్టి ఆస్తులు రాయించుకున్నారని, స్థలాలను కబ్జా చేశారని, కర్ణాటక మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారని, ఇసుక దందా నడుపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడ అవినీతికి పాల్పడ్డానో న్యూస్‌ చానళ్లు, పత్రికలవారు నిరూపించాలి. తప్పు చేసినట్లు నిరూపిస్తే తల దించుకుంటాను. లేదంటే తాట తీస్తాను. నాకు ఏదీ లెక్కలేదు. అన్నీ చేసొచ్చినోడినే’’ అని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలను ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. దీంతో జయరాం వివరణ ఇచ్చారు. తాను విలేకరులందరినీ అనలేదని, ఓ టీవీ చానల్‌ను ఉద్దేశించి అలా అన్నానని చెప్పారు.


ఎమ్మెల్యే గుమ్మనూరుకు టీడీపీ అధిష్ఠానం మందలింపు

ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను టీడీపీ అధిష్ఠానం మందలించింది. స్థానికంగా ఉండే పాత్రికేయులను ఎమ్మెల్యే దుర్భాషలాడారని, ఏబీఎన్‌తో పాటు మరికొన్ని చానల్స్‌ వార్తా కథనాలు ప్రసారం చేశాయి. దీంతో జయరాంకు ఫోన్‌ చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌... పాత్రికేయులను దుర్భాషలాడటం టీడీపీ సంస్కృతి కాదని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యేకు చెప్పారు.

Updated Date - Jan 30 , 2025 | 05:12 AM