Minister Payyavula: జీఎస్టీ హేతుబద్ధీకరణతో పేదలకు ప్రయోజనం
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:23 AM
పన్ను తగ్గింపుతో రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. అయితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి..
రాష్ట్ర ఆదాయం తగ్గినా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది
జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి: మంత్రి పయ్యావుల
న్యూఢిల్లీ, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘పన్ను తగ్గింపుతో రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. అయితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పయ్యావుల పాల్గొని మాట్లాడారు. వివరాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘ఆహార పదార్థాలు, దుస్తులు, పాదరక్షలు, ఔషధాలు వంటి నిత్యావసరాలపై పన్ను భారం తగ్గించాలి. వ్యవసాయ ఇన్‌పుట్, పనిముట్లుపై, చేనేత వస్త్రాలపై పన్నును సరళీకరించాలి. ఇతర వస్తు-సేవలపై పన్ను భారాన్ని తగ్గించాలి’ అని సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించిన జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణతో పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుత బహుళ పన్ను రేట్లను 0.1%, 5%, 18%కి సరళీకరించడం, కొన్ని విలాస వస్తువులపై 40% పన్ను విధించడం వల్ల పన్నుల వ్యవస్థ పారదర్శకంగా మారుతుంది’ అని పయ్యావుల పేర్కొన్నారు. కాగా, సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ, ‘ఎన్డీయే మిత్రపక్షంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జీఎస్టీ సంస్కరణలకు మద్దతు ఇస్తాం. జీఎస్టీ సంస్కరణలలో చాలవరకు సామాన్య ప్రజలకు, పేదవారికి సాయం చేస్తాయి. భారత ఆర్థికవ్యవస్థ కూడా వృద్ధి చెందుతుంది’ అని మంత్రి పేర్కొన్నారు.