Share News

పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్షలు

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:55 AM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-2 మెయిన్‌ ్స పరీక్షలు ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి.

పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్షలు

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-2 మెయిన్‌ ్స పరీక్షలు ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. విజయవాడ నగరంలో మొత్తం 19 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 8,792 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 8,146 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఉదయం జరిగిన పేపర్‌-1కు 7,376 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్‌ - 2 కు 7,352 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కొద్దిరోజులుగా అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్షలను బాగానే రాసినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. అభ్యర్థులు చెబుతున్న దాని ప్రకారం జనరల్‌ కేటగిరీ అభ్యర్ధికి 240 మార్కులు దాటితే ఖచ్చితంగా గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగం వస్తుందన్న భావనలో ఉన్నారు. మిగిలిన కేటగిరీల కేటగిరీకి 15 మార్కులు తగ్గించుకుంటూ పోతే 170 మార్కుల వరకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు: లక్ష్మీశ

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవంతంగా ముగిసినట్టు కలెక్టర్‌ లక్ష్మీశ ఆదివారం తెలిపారు. నగరంలో 19 కేంద్రాల్లో పేపర్‌-1కు 83.89 శాతం, పేపర్‌-2కు 83.62 శాతం మంది హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన కోఆర్డినేటింగ్‌, కస్టోడియన్‌, రూట్‌, లైజనింగ్‌ అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే రెవెన్యూ, పోలీస్‌, వైద్యారోగ్యం, విద్యుత్‌, ప్రజారవాణా శాఖల అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.

Updated Date - Feb 24 , 2025 | 12:55 AM