ఘనంగా తిరుగు రథోత్సవం
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:33 PM
కోడుమూరు చౌడేశ్వరీదేవి తిరుగు రథోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.

కోడుమూరు, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): కోడుమూరు చౌడేశ్వరీదేవి తిరుగు రథోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అలాగే రథానికి పూజ కార్యక్రమాలను ముగిసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుంచి తిరుగు రథోత్సవం నిర్వహించారు. తిరుగు రథోత్సవ వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పట్టణ పుర వీధులు జనంతో నిండిపోయాయి. సీఐ తబ్రేజ్, ఎస్‌ఐ ఏపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులుతీరారు.
అలరించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్
చౌడేశ్వరిదేవి తిరుణాల సందర్భంగా మన ఊరు మన జాతర కార్యక్రమాల స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంత మార్కెట్లో శుక్రవారం రాత్రి చేపట్టిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం ప్రజలను అలరించింది. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు నృత్య ప్రదర్శన ప్రజలను ఉత్తేజ పరిచింది. దేశ భక్తి, కూచిపూడి, భరతనాట్యంతో పాటు వివిధ సినిమా పాటలకు విద్యార్థులు వేసిన స్టెప్పులకు సంత మార్కెట్ మైదానం ఈళలు, చప్పట్లతో మార్మోగింది. వేదికపై మిమిక్రీ ఆరిస్టు ఉస్మాన్‌బాషా తన మిమిక్రీతో ప్రజలను కడుపుబ్బా నవ్వించారు. కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు లాయర్ ప్రభాకర్, నాగేశ్వరరావు, బలరాం, నటరాజ్, మధు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
ముగ్గుల పోటీలకు విశేష స్పందన :
స్థానిక తేరుబజారులో శుక్రవారం ఉదయం నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళ నుంచి విశేష స్పందన వాటిల్లింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన ముగ్గురికి వెండి కుంకుమ భరిణిలను అందజేయనున్నారు.
ముగిసిన రాయలసీమ ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు :
గత రెండు రోజులుగా సాగిన రాయలసీమ జోన్ ఓపెన్ షటిల్ బ్మాడ్మింటన్ పోటీలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. పోటీలకు 32 టీంలు వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగిన హోరాహోరీ పోటీల్లో అనంతరం జట్టు మొదటి స్థానంలో, నంద్యాల జట్టు రెండో స్థానంలో, మూడో స్థానంలో ఎమ్మిగనూరు, నాలుగో స్థానంలో కోడుమూరు జట్టు గెలుపొందాయి. గెలుపొందిన జట్లకు రూ.10వేలు, రూ.7500, రూ.5వేలు, రూ.3వేల నగదును అందించారు.
ముగిసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు
కోడుమూరు చౌడేశ్వరీ దేవి జాతర పురస్కరించుకొని ఈ నెల 3న ప్రారంభమైన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. దాదాపు 11 రోజుల పాటు సాగిన ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 30 క్రికెట్ జట్లు వచ్చాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీలల్లో చివరకు ఎమ్మిగనూరుకు చెందిన మహేంద్ర లెనిన్ టీం మొదటి బహుమతి రూ.50వేల నగదును గెలుచుకుంది. రెండో బహుమతి రూ.25 వేల నగదును కోడుమూరుకు చెందిన స్టార్ బాయ్స్ టీం, మూడో బహుమతి రూ.10 వేలను కోడుమూరుకు చెందిన అభిస్టార్ టీం గెలుచుకుంది. గెలుపొందిన టీంలకు బహుమతి దాతలు పాలవారి భాస్కర్‌రెడ్డి, సురేంద్ర, ఎ.యం ఆటోమొబైల్స్, 2004-2005 పూర్వ విద్యార్థులు నగదును అందజేశారు.