Share News

Ontimitta Sitarama Kalyanam: నేడే ఒంటిమిట్ట రాములోరి కల్యాణం

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:38 AM

ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కోసం టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేయబడ్డాయి. పవిత్ర కల్యాణాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో రంగురంగుల విద్యుద్దీపాలతో ఆలయం వెలిగిపోతోంది

Ontimitta Sitarama Kalyanam: నేడే ఒంటిమిట్ట రాములోరి కల్యాణం

  • సుందరంగా ముస్తాబైన ఏకశిలానగరం

ఒంటిమిట్ట/రాజంపేట, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): సీతారాముల కల్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరుగనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. వేదిక ముందుభాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుద్దీపాలు, దేశ, విదేశాల్లో లభించే అరుదైన పుష్పాలతో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయానికి సమీపంలో కల్యాణవేదిక ప్రాంతంలో 23 భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్పీ అశోక్‌కుమార్‌, జేఈవో వీరబ్రహ్మం గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. కల్యాణోత్సవ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిలకించడానికి వీలుగా టీటీడీ ఎస్వీబీసీ చానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

గరుడ వాహనంపై జగదభిరాముడి దర్శనం

ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం ఉదయం మోహినీ అవతారంలో, రాత్రి గరుడ వాహనంపై శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చారు.


సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు

శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణ అప్పారావు ఆధ్వర్యంలో 120 కిలోల తలంబ్రాలను టీటీడీ అధికారులు హనుమంతయ్య, శ్రావణకుమార్‌కు గురువారం అందజేశారు. వీటికోసం మూడు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, తమిళనాడుకు చెందిన భక్తులు ఎంతో భక్తితో 3నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారని తెలిపారు. ఈ సంఘం ఆధ్వర్యంలో గత 14ఏళ్లుగా భద్రాద్రి రామునికి, మూడేళ్లుగా అయోధ్యకు, ఎనిమిదేళ్లుగా ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం సందర్భంగా కోటి తలంబ్రాలను అందజేస్తున్నట్లు అప్పారావు పేర్కొన్నారు.

పండు వెన్నెల్లో నెలరాజు చూస్తుండగా...

శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. ఆయన పరిణయ మహోత్సవాలు అయోధ్యలోనైనా.. భద్రాద్రిలోనైనా.. ఏ ఇతర రామాలయ క్షేత్రాలలోనైనా నవమి నాడే అభిజిత్‌ లగ్నంలో పగటిపూట మాత్రమే జరపడం ఆనవాయితీ. అలాగే అన్ని ఆలయాల్లో చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఉత్సవాలు మొదలై నవమి నాటి కల్యాణంతో ముగుస్తాయి. అయితే అందుకు భిన్నంగా శ్రీరామచంద్రుడు, సీతమ్మను పరిణయమాడే మహత్తర ఉత్సవాన్ని చైత్ర శుద్ధ చతుర్ధశి నాటి రాత్రివేళ పండువెన్నెల్లో నిర్వహించడం ఏకశిలానగరి ఒంటిమిట్టలో మాత్రమే ప్రత్యేకం.

Updated Date - Apr 11 , 2025 | 04:38 AM