Tirumala: తిరుమలలో రథసప్తమికి పటిష్ఠ ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:02 AM
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ శుభం బన్సాల్‌తో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఈవో సమీక్షించారు.

టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుమల, జనవరి 24(ఆంధ్రజ్యోతి): సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో ఫిబ్రవరి 4వ తేదీన జరుగనున్న రథసప్తమికి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ శుభం బన్సాల్‌తో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఈవో సమీక్షించారు. భక్తులు గ్యాలరీల్లో ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. గ్యాలరీల్లో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మాడవీధుల్లో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. తర్వాత ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ..
ఆ రోజు ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు మొదలై రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయన్నారు. మొత్తం ఏడు వాహనాలపై శ్రీవారు దర్శనమిస్తారని తెలిపారు. పుష్కరిణిలో జరిగే చక్రస్నానం కార్యక్రమానికి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా.. రథసప్తమి రోజున అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు వీఐపీ బ్రేక్, ఎన్‌ఆర్‌ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుపతిలో ఫిబ్రవరి 3, 4, 5వ తేదీలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం(ఎ్‌సఎ్‌సడీ) టోకెన్ల జారీని కూడా రద్దు చేశామన్నారు.