Share News

PM Modi Visits to Amaravati: మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:58 AM

మే 2న అమరావతిలో జరిగే ప్రధానమంత్రి మోదీ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. విమానాశ్రయం నుంచి సభ ప్రాంగణం వరకు రహదారి అభివృద్ధితో పాటు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

PM Modi Visits to Amaravati: మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు

సభా ప్రాంగణానికొచ్చే రోడ్లకు మెరుగులు

ఎక్కడా ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా చర్యలు

సభికులకు అల్పాహారం, తాగునీరు, మజ్జిగ

పండ్లు, భోజనం.. 10 పార్కింగ్‌ స్థలాలు

29వ తేదీ నాటికి మొత్తం ఏర్పాట్లు పూర్తి

మే 2న అమరావతికి ప్రధాని శంకుస్థాపన

ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మే 2వ తేదీన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్ల నిమిత్తం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం విజయవాడలోని జల వనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రంలో సమావేశమైంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. ప్రధాని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా ఆహారం, తాగునీరు వంటి వసతుల కల్పనలో ఏ మాత్రం రాజీపడరాదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రధాని సభా ప్రాంగణానికి చేరుకునే రహదారులను మెరుగుపరచాలని సూచించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ... ప్రధాని పర్యటన రోజు ఎక్కడా ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా చూడాలని పోలీసుల అధికారులను ఆదేశించారు. గ్రామీణ రహదారులు అయినందున ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో చిలకలూరిపేట, విశాఖపట్నంలో ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన చిన్న చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. మోదీ సభను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం ప్రధాని మోదీ మే 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని సీఎస్‌ విజయానంద్‌ తెలిపారు.

hgkm.jpg

అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాష్ట్ర సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు షో ద్వారా సచివాలయం వెనుక వైపు గల ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి విధులు కేటాయించిన అధికారులు తమ బృందాలతో కలసి అప్పగించిన పనులు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఏర్పాట్లలో ఇతర ఏ విధమైన సమస్యలున్నా నోడల్‌ అధికారి వీరపాండ్యన్‌తో సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రధాని కార్యక్రమాల పర్యవేక్షణ నోడల్‌ అధికారి వీరపాండ్యన్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పర్యటన ఏర్పాట్లను వివరిస్తూ ప్రధాని షెడ్యూల్‌ను ప్రకటించారు. రెండు గంటల పాటు సాగే ప్రధాని పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


10 పార్కింగ్‌ స్థలాలు

ప్రధాని పర్యటనకు సంబ ంధించి 10 పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసి అక్కడ తాగునీరు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు వీరపాండ్యన్‌ తెలిపారు. వీవీఐపీలకు కరకట్ట, సీడ్‌యాక్సిస్‌ రోడ్లను ప్రత్యేకంగా కేటాయించనున్నట్టు తెలిపారు. సామాన్య ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుక వీలుగా విజయవాడ నుంచి మరో రెండు రూట్లు, గుంటూరు నుంచి నాలుగు రూట్లు, మరికొన్ని తాత్కాలిక రూట్లను కూడా ట్రాఫిక్‌కు అంతరాయాలు లేకుండా సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా రోడ్లన్నీ గుంతలులు లేకుండా తీర్చిదిద్దాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. వివిధ జిల్లాల నుంచి సభకు తీసుకొచ్చే వారందరికీ అల్పాహారం, తాగునీరు, మజ్జిగ, పండ్లు, భోజనం వంటివి పంపిణీ చేయాలని సంబంధిత ఇన్‌చార్జులకు సూచించారు. ఈ విషయంలో రాజీపడొద్దని, ఎక్కడా ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రానికి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. 30 తేదీన రిహార్సల్‌ ఉంటుందని, తదుపరి ఎస్పీజీ రిహార్సల్స్‌ ఉంటాయని తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించి ఆయా అధికారులు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు డైలీ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురేశ్‌ కుమార్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు, అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ మధుసూధన్‌రెడ్డి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు లక్ష్మీశ, బాలాజీ, నాగలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 11:28 PM