Share News

ధాన్యం..దైన్యం

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:08 AM

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రైతుల వద్ద కుప్పల మీదే నాలుగు లక్షల టన్నుల ధాన్యం ఉంది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామన్న పౌరసరఫరాలశాఖ అధికారులు తమ టార్గెట్లు దాదాపు పూర్తయ్యాయంటున్నారు. పొలాల్లోనే ఉన్న ధాన్యం గురించి ప్రశ్నిస్తే మౌనవ్రతం పాటిస్తున్నారు. మిల్లులకు టార్గెట్‌లు పెంచే విషయంలో ఎలాంటి సమాచారం, హామీ ఇవ్వకుండా మిన్నుకుండిపోతున్నారు. ఏటా మార్చి నెలాఖరు వరకు జిల్లాలో రెండో విడతగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. ఈ ఏడాది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంతమేర ధాన్యం కొనుగోలుకు అనుమతులు వస్తాయనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

ధాన్యం..దైన్యం

-జిల్లాలో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు

-కుప్పల మీదే 4 లక్షల టన్నుల ధాన్యం

-టార్గెట్‌ పూర్తయ్యిందంటున్న అధికారులు

-ఇదే అదనుగా తక్కువ ధరకు అడుగుతున్న మిల్లర్లు

-దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రైతుల వద్ద కుప్పల మీదే నాలుగు లక్షల టన్నుల ధాన్యం ఉంది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామన్న పౌరసరఫరాలశాఖ అధికారులు తమ టార్గెట్లు దాదాపు పూర్తయ్యాయంటున్నారు. పొలాల్లోనే ఉన్న ధాన్యం గురించి ప్రశ్నిస్తే మౌనవ్రతం పాటిస్తున్నారు. మిల్లులకు టార్గెట్‌లు పెంచే విషయంలో ఎలాంటి సమాచారం, హామీ ఇవ్వకుండా మిన్నుకుండిపోతున్నారు. ఏటా మార్చి నెలాఖరు వరకు జిల్లాలో రెండో విడతగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. ఈ ఏడాది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంతమేర ధాన్యం కొనుగోలుకు అనుమతులు వస్తాయనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

జిల్లాలోని 1.65 లక్షల హెక్టార్లలో గత ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు చేశారు. 9.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 5.24 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. చల్లపల్లి, మొవ్వ, ఘంటసాల, మచిలీపట్నం, కోడూరు, గూడూరు, పామర్రు, ఉయ్యూరు, నాగాయలంక తదితర మండలాల్లో ఇంకా నాలుగు లక్షల టన్నుల ధాన్యం కుప్పల రూపంలో ఉంది. రైతులు తమ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సేవా కేంద్రాలు, మిల్లర్ల వద్దకు వెళితే టార్గెట్‌లు పూర్తయ్యాయని చెబుతున్నారు. అధికారుల నుంచి అనుమతులు వచ్చేవరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సర్వర్‌లో ధాన్యం వివరాలు నమోదు చేయడానికి అవకాశం లేదని మిల్లర్లు, రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది అంటున్నారు. ధాన్యం ఆన్‌లైన్‌ చేస్తారనే ఆశతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ఇప్పటి వరకు 60 వేల టన్నులకుపైగా ధాన్యం ముందస్తుగానే మిల్లులకు తరలించారు. మిల్లుల వద్దకు చేరిన ధాన్యం విక్రయించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి అవకాశం లేకపోవడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసేందుకు టార్గెట్‌ పూర్తయిందనే కారణాలు చూపి మిల్లర్లు ఈ ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌ చేయకుండా జాప్యం చేస్తున్నారు. రైతుల ఇబ్బందుల నేపథ్యంలో తమ వద్ద ఉన్న ధాన్యం, ఇంకా కుప్పల రూపంలో ఉన్న ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లులకు టార్గెట్‌లు పెంచాలని కోరుతూ పౌరసరఫరాల శాఖ కార్యాలయం చుట్టూ మిల్లు యాజమానులు తిరుగుతున్నారు. శానన సభ్యులు, మంత్రులు, ఎంపీలు ఎవరైనా జేసీ లేదా పౌరసరఫరాలశాఖ అధికారులకు చెబితే జిల్లాలోని ఒకటి, రెండు మిల్లులకు రూ.5వేలు, రూ.10వేల క్వింటాళ్ల మేర టార్ట్గెట్‌లు పెంచి సరిపెట్టేస్తున్నారు. తమకు టార్గెట్‌ పెంచలేదనే కారణం చూపి మిగతా మిల్లర్లు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలేదు.

ప్రభుత్వంపైనే రైతుల ఆశలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లుగా మిల్లర్లు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం నగదు జమ చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా ధాన్యం విక్రయిస్తే వెంటనే నగదు రావడం, ప్రస్తుతం ధాన్యంలో తేమశాతం లేకపోవడంతో 75 కిలోల బస్తాకు రూ.1,725 నుంచి 1740 వరకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తుందని రైతుల్లో ఆశ. నగదు ఎక్కడికిపోదనే నమ్మకం. ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యం విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు.

ప్రైవేటుగా విక్రయిద్దామంటే ధర తగ్గించి అడుగుతున్నారు..

మిల్లు యజమానులు తమకు ఇచ్చిన టార్గెట్‌లు పూర్తయ్యాయని, ధాన్యం కొనుగోలు చేయలేమని చెబుతూనే ప్రైవేటుగా ధాన్యం విక్రయిస్తే 75కిలోల బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.1,725 అయితే వీరు రూ.1500 నుంచి 1600 మించి ధర ఇవ్వలేమని చెబుతున్నారు. ధాన్యం నగదు ఇవ్వడానికి వారం రోజులు, లేకపోతే 20 రోజుల సమయం పడుతుందని షరతులు విధిస్తున్నారు. మిల్లర్లు ధాన్యం ధరలో కోత పెడుతుండటంతో బస్తాకు రూ.150 నుంచి 200 వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టార్గెట్‌ పెంచుతారా!

జిల్లాలో 5.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా 56 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా చూపితే, అప్పుడు మిల్లులకు టార్గెట్‌ పెంచే అవకాశాలు ఉండవచ్చని అధికారులు సూచనప్రాయంగా పేర్కొంటున్నారు.

Updated Date - Feb 07 , 2025 | 12:08 AM