ధాన్యం దయనీయం
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:26 AM
అన్నదాతలకు అన్యాయమే జరుగుతోంది. మినుము తీతలకు సమయం ఆసన్నం కావడంతో కుప్ప నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో రైతుల వద్ద నాలుగు లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్ధమవ్వగా, ధాన్యం కొనుగోలు చేయాలని జేసీ గీతాంజలిశర్మ పౌరసరఫరాల సంస్థకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ శాఖ అధికారులు కేవలం 30 వేల టన్నులే కొనుగోలు చేసేందుకు ఈ నెల 10వ తేదీన అనుమతి ఇచ్చారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రైవేటు వ్యక్తులు ఇదే అదనుగా బస్తా ధాన్యాన్ని రూ.1,350 నుంచి 1,600 వరకు అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిఽధులే తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

- జిల్లాలో రైతుల వద్ద ధాన్యం 4 లక్షల టన్నులు
- కొనుగోలుకు అనుమతినిచ్చింది 30 వేల టన్నులకే..
- మిగిలిన ధాన్యం ఏం చేసుకోవాలని రైతుల కన్నీరు
- మినుము తీతల సమయం కావడంతో కుప్పనూర్పిళ్లు ముమ్మరం
- బస్తా రూ.1,350 నుంచి 1,600 వరకు తగ్గించి అడుగుతున్న మిల్లర్లు, మధ్యవర్తులు
- న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులకు అన్నదాతల విజ్ఞప్తి
అన్నదాతలకు అన్యాయమే జరుగుతోంది. మినుము తీతలకు సమయం ఆసన్నం కావడంతో కుప్ప నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో రైతుల వద్ద నాలుగు లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్ధమవ్వగా, ధాన్యం కొనుగోలు చేయాలని జేసీ గీతాంజలిశర్మ పౌరసరఫరాల సంస్థకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ శాఖ అధికారులు కేవలం 30 వేల టన్నులే కొనుగోలు చేసేందుకు ఈ నెల 10వ తేదీన అనుమతి ఇచ్చారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రైవేటు వ్యక్తులు ఇదే అదనుగా బస్తా ధాన్యాన్ని రూ.1,350 నుంచి 1,600 వరకు అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిఽధులే తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లాలోని మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక మండలాలు సాగునీటి కాలువలకు శివారున ఉండటంతో ప్రస్తుతం యంత్రాల ద్వారా వరికోతలు చేస్తున్నారు. ఘంటసాల, చల్లపల్లి, మొవ్వ, పామర్రు, ఉయ్యూరు, గూడూరు తదితర మండలాల్లో ధాన్యం కుప్పల రూపంలో ఉంది. ప్రస్తుతం మినుము తీత పనులు వేగవంతమయ్యాయి. దీంతోపాటే రైతులు కుప్పనూర్పిళ్లు చేసి తమ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సేవా కేంద్రాలు, మిల్లర్ల వద్దకు వెళ్తుంటే తమకు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు పూర్తయ్యాయని చెబుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని మిల్లర్లు చెబుతూనే, బస్తా ధాన్యం మద్దతు ధర రూ.1,725, 1,740 ఉంటే రూ.1600 అడుగుతున్నారు. ఈ ధాన్యం మండపేట, తిరుపతి తదితర ప్రాంతాల్లోని మిల్లులకు విక్రయిస్తామని, రవాణా, ఇతరత్రా ఖర్చులు ఉన్న నేపథ్యంలో ఇంతకు మించి ధర ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం యంత్రాల ద్వారా వరికోతలు పూర్తి చేస్తున్న కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం మండలాల్లోని ధాన్యం ఇతర జిల్లాలకు విక్రయించాలంటే ధాన్యంలో తేమశాతం సాకుగా చూపి బస్తాకు రూ.1,350 నుంచి 1400 మించి ధర ఇవ్వలేమని రైతులతో మిల్లర్లు, మధ్యవర్తులు బేరాలకు దిగుతున్నారు.
మిల్లులకు కొసరి కొసరి వడ్డింపులు
మినుము సాగు అధికంగా జరిగిన మండలాల్లో రైతులు వరి పంటను కోతకోసి కుప్పలుగా వేసి ఉంచారు. ప్రస్తుతం జిల్లాలో కుప్పల రూపంలో నాలుగు లక్షల టన్నుల ధాన్యం ఉంది. ఈ ధాన్యం కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం మిల్లులకు టార్గెట్‌లు పెంచాల్సి ఉంది. జిల్లాలో నాలుగు లక్షల టన్నుల ధాన్యం కుప్పల రూపంలో ఉందని, ఈ ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ గీతాజలి శర్మ పౌరసరఫరాల సంస్థ ఎండీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన పౌరసరఫరాలసంస్థ ఉన్నతాధికారులు జిల్లా నుంచి కేవలం 30వేల టన్నులను కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ 30వేల టన్నుల ధాన్యానికి సంబంధించిన కొనుగోళ్ల టార్గెట్‌లను కొసరి కొసరి మిల్లులకు కేటాయించారు.
అనుమతులు ఇస్తేనే..
జిల్లాలో ఏటా నవంబరు 16వ తేదీన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి మార్చి నెలాఖరు వరకు కొనసాగిస్తారు. ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ పూర్తయినా రెండో విడతలో మళ్లీ అనుమతులు ఇచ్చి మార్చి 31వ తేదీ నాటికి ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తారు. కానీ ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు నాటికే మిల్లులకు ఇచ్చిన టార్గెట్లు పూర్తయ్యాయని లెక్కలు చూపి ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభించలేదు. మిల్లు యజమానులు, మధ్యవర్తులు నిర్ణయించిన ధరకే ధాన్యం రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి రైతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.