Share News

Education System: అ..ఆ..లూ రావట్లేదు

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:02 AM

ఇలాంటి సరళమైన పదాలతో ఉన్న రెండో తరగతి స్థాయి తెలుగు పాఠాన్ని కూడా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థుల్లో 44 శాతం మంది తప్పుల్లేకుండా చదవలేకపోతున్నారు.

Education System: అ..ఆ..లూ రావట్లేదు

  • రెండో తరగతి పాఠ్యపుస్తకాలూ చదవలేరు

  • లెక్కలు చేయలేరు.. ఎక్కాలు అసలే రావు

  • 3 నుంచి 8వ తరగతి వరకూ ఇదే దుస్థితి

  • విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తీసికట్టు

  • ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి మరీ దారుణం

  • ప్రైవేటు బడుల విద్యార్థులు అంతంతమాత్రం

  • జాతీయ సగటుతో పోలిస్తే వెనకబడిన రాష్ట్రం

  • అసర్‌, పరఖ్‌ సర్వేలపై విద్యాశాఖ సమీక్ష

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఒక చెరువు పక్కన పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక కాకి గూడు కట్టుకుంది. ఆ గూట్లో కాకి తన పిల్లలతో హాయిగా కాలం గడుపుతూ ఉండేది’...

ఇలాంటి సరళమైన పదాలతో ఉన్న రెండో తరగతి స్థాయి తెలుగు పాఠాన్ని కూడా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థుల్లో 44 శాతం మంది తప్పుల్లేకుండా చదవలేకపోతున్నారు. మూడో తరగతి విద్యార్థుల్లో కేవలం 15.5 శాతం మంది, ఐదో తరగతి పిల్లలు 37.7 శాతం మంది మాత్రమే రెండో తరగతి పుస్తకాన్ని చదవగలుతున్నారు. మిగిలిన వారంతా అక్షరాలు కూడా సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(అసర్‌)-2024 నివేదిక వెల్లడించిన వాస్తవాలివి. ఇక ఆరో తరగతి విద్యార్థుల్లో 48 శాతం మందికే భాషా సబ్జెక్టులపై అవగాహన ఉంది. గణితంపై 41శాతం మందికి, పర్యావరణ సైన్స్‌పై 40శాతం మందికి మాత్రమే పట్టు ఉంది. మొత్తంగా మూడో తరగతి భాషా సబ్జెక్టులు, గణితం మినహాయిస్తే మిగిలిన అన్ని సబ్జెక్టుల్లోనూ జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని పరఖ్‌ రాష్ర్టీయ సర్వేక్షన్‌ (నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే)-2024 స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో సృష్టించిన విధ్వంసం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను దారుణంగా దెబ్బతీసింది. ప్రాథమిక విద్యను గాలికొదిలేసింది. కొన్నిచోట్ల విద్యార్థులకు ఇంగ్లిష్‌ నేర్పించి రాష్ట్రమంతా అలాగే ఉందని ప్రచారం చేసుకుంది. ఇప్పుడు జాతీయ సర్వే నివేదికలతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సర్వేలను సమీక్షించిన పాఠశాల విద్యాశాఖ.. లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ప్రాథమిక తరగతుల విద్యార్థులకు త్వరలో నిర్వహించబోయే ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌-1 పరీక్షలను సిలబస్‌పై కాకుండా ప్రాథమిక అంశాలపైనే నిర్వహించాలని నిర్ణయించింది.


అసర్‌ నివేదిక ప్రకారం...

  • రాష్ట్రంలో మూడో తరగతి విద్యార్థులు 15.5శాతం, ఐదో తరగతి వారు 37.7శాతం, 8వ తరగతి వారు 56.2శాతం మంది రెండో తరగతి పాఠాలు చదవగలుగుతున్నారు. వీటిని చదవగలిగిన మూడో తరగతి ప్రభుత్వ బడుల విద్యార్థులు 14.7శాతం మంది ఉంటే, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు 16.8శాతం ఉన్నారు. ఐదో తరగతిలో ప్రభుత్వంలో 37.5శాతం, ప్రైవేటులో 38.5శాతం, 8వ తరగతిలో ప్రభుత్వంలో 53శాతం, ప్రైవేటులో 64.8శాతం మంది చదవగలుగుతున్నారు.

  • ప్రభుత్వ బడుల్లో చదివే 3వ తరగతి విద్యార్థులు 40.9 శాతం మంది తీసివేతలు చేయగలిగితే, ప్రైవేటులో 48.7 శాతం మంది ఉన్నారు.

  • ఐదో తరగతి ప్రభుత్వ విద్యార్థులు భాగాహారాలను 35.1శాతం మంది, ప్రైవేటులో 38.5శాతం మంది చేస్తున్నారు. 8వ తరగతిలో ప్రభుత్వంలో 45.2శాతం, ప్రైవేటులో 56.6శాతం మంది చేయగలుగుతున్నారు.


పరఖ్‌ సర్వే ప్రకారం...

  • మూడో తరగతి విద్యార్థుల్లో 64శాతం మందికి భాషా సబ్జెక్టులపై, 61శాతం మందికి గణితంపై అవగాహన ఉంది. ఈ రెండింటిలో మాత్రమే జాతీయ స్థాయితో సమానంగా రాష్ట్ర విద్యార్థులున్నారు.

  • ఆరో తరగతిలో భాషా సబ్జెక్టులపై జాతీయ స్థాయిలో 57శాతం మంది మెరుగ్గా ఉంటే, ఏపీలో ఇది 48శాతానికే పరిమితమైంది.

  • గణితంలో జాతీయ స్థాయిలో 46శాతం మెరుగ్గా ఉంటే, ఏపీలో 41శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది.

  • 9వ తరగతి ఏపీ విద్యార్థులకు భాషలపై 50శాతం మందికి, గణితంపై 35శాతం మందికి, సైన్స్‌పై 36శాతం మందికి, సోషల్‌ 37శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది. ఈ విభాగాల్లో జాతీయ సగటు వరుసగా 54శాతం, 37శాతం, 40శాతం, సోషల్‌పై 40శాతంగా ఉంది.


జిల్లాల వారీగా ఇలా...

  • పరఖ్‌ సర్వే ప్రకారం గణితం, పరిసరాలపై అవగాహన పెంచుకోవడం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల్లో విద్యార్థులు బాగా వెనకబడిపోయారు. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

  • అల్లూరి జిల్లాలో ఫౌండేషనల్‌ ఇంగ్లి్‌షలో చిన్నపాటి స్టోరీలను 55శాతం మంది చదవగలరు. చిన్నవార్తలు, సూచికలను 60 శాతం మంది చదువుతున్నారు. 99 వరకు అంకెలను ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చగలిగేవారు 53 శాతం మంది ఉన్నారు.

  • అనకాపల్లి జిల్లాలో రేఖలు, కోణాలు, త్రికోణాలు ఉపయోగించి గణితంలో సమస్యలను పరిష్కరించడం 35శాతం మందికి మాత్రమే తెలుసు. కరెంటు గురించిన ప్రశ్నలకు 28శాతం మందికి, అయస్కాంత శక్తి గురించి 32 శాతం మందికే అవగాహన ఉంది.

  • అనంతపురం జిల్లాలో చిన్నపాటి ఇంగ్లిష్‌ స్టోరీలను 47శాతం మంది చదవగలరు. చిన్న వార్తలు, సూచికలను 49ు మంది చదివి అర్థంచేసుకుంటున్నారు. గణితం, ఇంగ్లిష్‌, సైన్స్‌లో జిల్లా పరిస్థితి దారుణంగా ఉంది.

Updated Date - Jul 07 , 2025 | 02:04 AM