Share News

Liquor Policy : ఎక్సైజ్‌ లెక్క తప్పింది

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:22 AM

మద్యం పాలసీని అమల్లోకి తెచ్చే క్రమంలో ఎక్సైజ్‌ శాఖ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సరైన కసరత్తు లేకుండా లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్‌పై ఆ శాఖ వేసిన అంచనాల లెక్క తప్పింది. దీంతో పాలసీ అమల్లోకి వచ్చిన మూడు నెలల తర్వాత దాన్ని

Liquor Policy : ఎక్సైజ్‌ లెక్క తప్పింది

మార్జిన్‌ విషయంలో తొందరపాటు

ఇష్యూ ప్రైస్‌ అంచనాలో మెలిక

లైసెన్సీల ఆందోళనతో దిద్దుబాటు చర్యలు

14 శాతం మార్జిన్‌కు కేబినెట్‌ ఆమోదం

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మద్యం పాలసీని అమల్లోకి తెచ్చే క్రమంలో ఎక్సైజ్‌ శాఖ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సరైన కసరత్తు లేకుండా లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్‌పై ఆ శాఖ వేసిన అంచనాల లెక్క తప్పింది. దీంతో పాలసీ అమల్లోకి వచ్చిన మూడు నెలల తర్వాత దాన్ని సవరించాల్సి వచ్చింది. తాజా కేబినెట్‌ సమావేశంలో మార్జిన్‌ సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయంపై ప్రభా వం పడే అవకాశం ఉంది. వినియోగదారులపైనా కొంతమేర భారం పడనుంది. లైసెన్సీలకు 14శాతం మార్జిన్‌ ఇస్తామని ఇప్పటికే సీఎం నిర్ణయం తీసుకోగా, అందుకు అనుగుణంగా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఇష్యూ ప్రైస్‌కు సొంత నిర్వచనం

సాధారణంగా మద్యం లైసెన్సీలకు ఇష్యూ ప్రైస్‌పై మార్జిన్‌ ఇస్తారు. మద్యం సీసాపై అన్ని రకాల పన్నులు వేసిన తర్వాత వచ్చేదానిని ఇష్యూ ప్రైస్‌ అంటారు. ఇష్యూ ప్రైస్‌ తర్వాత లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్‌ మరో పన్నుగా ఉంటుంది. రెండూ కలిపితే ఎమ్మార్పీ అవుతుంది. అక్టోబరులో అమల్లోకి తెచ్చిన మద్యం పాలసీలో ఇష్యూ ప్రైస్‌పై 20శాతం లైసెన్సీలకు మార్జిన్‌గా ఇస్తామని ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. అన్నట్టుగానే ఇస్తోంది. కానీ వాస్తవంగా చూస్తే వారికి 10శాతమే మార్జిన్‌ వస్తోంది. లెక్క ఎక్కడ మారిందంటే ఇష్యూ ప్రైస్‌ నిర్వచనాన్ని ఎక్సైజ్‌శాఖ మార్చేసింది. మొత్తం పన్నులపై 20శాతం మార్జిన్‌ ఇస్తారని భావించిన వ్యాపారులు లైసెన్స్‌ల కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ, లాభాలు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనలకు దిగే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు సవరణలు చేస్తోంది.

మార్జిన్‌ సవరణ ప్రభావం ఇదీ

మార్జిన్‌ పెంచడం వల్ల సుమారు రూ.వెయ్యి కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోనుంది. దీంతో ఆ నష్టాన్ని నివారించేందుకు ఎక్సైజ్‌ శాఖ పలు ప్రతిపాదనలు చేసింది. ఎమ్మార్పీ రూ.150 దాటిన బ్రాండ్లపై రూ.10 ధర పెంచేలా ఓ ప్రతిపాదన చేసింది. అన్ని కేటగిరీలకు 14శాతం మార్జిన్‌ ఇస్తూ, రూ.150 దాటిన బ్రాండ్లపై రూ.10 పెంచితే ప్రభుత్వం రూ.135 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. క్వార్టర్‌ రూ.99 బ్రాండ్లు మినహా అన్నిటిపైనా రూ.10 పెంచి, 14శాతం మార్జిన్‌ ఇస్తే రూ.320 కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. రూ.150 దాటిన బ్రాండ్లపై రూ.10 పెంచి మార్జిన్‌ను రెండు కేటగిరీల్లో 10.5, 14 శాతాలుగా అమలుచేస్తే రూ.220 కోట్ల ఆదాయం పెరుగుతుంది. దీనిపై ఎక్సైజ్‌ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Feb 07 , 2025 | 04:22 AM