UGC Violations: 28 మంది శాస్త్రవేత్తలకు షాక్
ABN , Publish Date - May 24 , 2025 | 04:55 AM
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు పొందిన 28మంది శాస్త్రవేత్తల పదోన్నతులను ప్రభుత్వం రద్దు చేసింది. అక్రమ పదోన్నతులపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీచేసింది.
అక్రమ పదోన్నతులపై సర్కార్ కొరడా.. రంగా వర్సిటీలో 28మంది పదోన్నతులు రద్దు
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని నిర్ధారణ
గత పాలకుల సహకారంతో ఇష్టారాజ్యంగా పదోన్నతులు
అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు పొందిన 28 మంది శాస్త్రవేత్తలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారి పదోన్నతులు రద్దు చేయడంతోపాటు, తద్వారా పొందిన లబ్ధిని రికవరీ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో సీనియారిటీని ముందుకు జరిపి, బోగస్ సర్టిఫికెట్లు పెట్టి, రాజకీయ, అధికార పలుకుబడిని ఉపయోగించి 2021-22 మధ్య 34మంది శాస్త్రవేత్తలు/ఆచార్యులు పదోన్నతులు పొందారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ వ్యవహారంపై వర్సిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 28మంది పదోన్నతులను రద్దు చేసి, దీనిపై విజిలెన్స్ విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో రీసెర్చ్ అసోసియేట్(ఆర్‌ఏ)లో సర్వీస్ వ్యవధిని తగ్గించడం ద్వారా పదోన్నతులతో అదనంగా పొందిన వేతన సొమ్ము రికవరీకి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన 12ఏళ్ల తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి ఇస్తారు. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరడానికి ముందు.. అడ్‌హాక్ ప్రాజెక్ట్స్‌లో చేసిన కాంట్రాక్ట్, టెంపరరీ సర్వీస్ కాలాన్ని కలిపి 34మందికి పదోన్నతి ఇవ్వడం వల్ల వీరి కంటే ముందు చేరినవారు జూనియర్లుగా మారారు.
వైసీపీ పెద్దల అండతో అక్రమాలు
వర్సిటీలో కొంతమంది శాస్త్రవేత్తలు పదోన్నతి కోసం పూర్వపు కాంట్రాక్ట్, టెంపరరీ సేవలను పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థనలు సమర్పిస్తుంటారు. కానీ ఇవి యూజీసీ నిబంధనలకు విరుద్ధమైనందున వర్సిటీ అధికారులు తిరస్కరిస్తుంటారు. గత వైసీపీ పాలనలో 34 మంది శాస్త్రవేత్తలు సంబంధిత అధికారులను ప్రభావితం చేసి పదోన్నతులు పొందారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయకుండా అప్పటి వర్సిటీ పెద్దలు, కీలక అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఫిర్యాదు చేసిన వారిని మారుమూల ప్రాంతాలకు పంపారు. ఈ చట్ట విరుద్ధమైన పదోన్నతుల ప్రభావం వర్సిటీ పరిధిలోని దాదాపు 500మంది శాస్త్రవేత్తల సీనియారిటీపై పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గతంలో ఇచ్చిన పదోన్నతుల ఉత్తర్వులను సమీక్షించాలని కొందరు శాస్త్రవేత్తలు వర్సిటీకి వినతిపత్రం అందజేశారు. దీంతో యూజీసీ నిబంధనలకు అనుగుణంగా పదోన్నతులు ఉన్నాయా.. లేవా? అనే అంశంపై సమీక్ష కోసం వర్సిటీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2021-23 మధ్య ఇచ్చిన అన్ని పదోన్నతులపై సమీక్షించి, వర్సిటీకి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. యూజీసీ సవరించిన పే స్కేల్స్‌లో శాస్త్రవేత్తలు, ఆచార్యులకు రీసెర్చ్ అసోసియేట్(ఆర్‌ఏ)లో పరిగణలోకి తీసుకున్న గత సర్వీ్‌సను, కేరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం (సీఏఎస్) ద్వారా పదోన్నతుల్లోని వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ, 28మంది శాస్త్రవేత్తలకు చట్టవిరుద్ధంగా ఇచ్చిన పదోన్నతులను వెంటనే ఉపసంహరించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ, వర్సిటీకి మెమో జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 28మంది శాస్త్రవేత్తల పదోన్నతులను ఉపసంహరిస్తూ, యూనివర్సిటీ ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమంగా పదోన్నతులు పొందిన శాస్త్రవేత్తలు, ఆచార్యులు ఇప్పటికే రూ. 8కోట్ల మేర లబ్ధి పొందారని ప్రభుత్వం గుర్తించింది.
పదోన్నతి కోసం నకిలీ సర్టిఫికెట్!
మరోవైపు గతంలో వైసీపీ నేతలతో అంటకాగిన ఒక ఆచార్యుడు పదోన్నతుల కోసం సమర్పించిన సర్టిఫికెట్ నకిలీదని వర్సిటీ పరిశీలనలో తేలింది. పదోన్నతి కోసం వర్సిటీని తప్పుదారి పట్టించిన అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ వ్యక్తికి అర్హత లేకున్నా.. గత ప్రభుత్వ పెద్దల వద్ద ఉన్న పలుకుబడితో కీలక పదవి పొందారు. పైగా రెండు వర్సిటీలకు బోర్డు సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి వర్సిటీకి రిపోర్టు చేసి, ఓ వ్యవసాయ కళాశాలలో పోస్టింగ్ పొందారు.