సధరం ట్రాన్సఫర్..!
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:46 AM
వైకల్య ధృవీకరణ పత్రాల కోసం సదరం స్లాట్ బుకింగ్‌లో దళారులు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తొలుత స్లాట్‌లను బ్లాక్ చేసి, డబ్బులిచ్చిన వారికి బుకింగ్ చేశారు. జిల్లాలో స్లాట్‌లన్నీ భర్తీ అయ్యాయి. దళారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ట్రాన్స...
జిల్లాలో స్లాట్‌లు భర్తీ
ఇతర ప్రాంతాల్లో బుకింగ్
తిరిగి ట్రాన్సఫర్ చేయిస్తామని హామీ
రూ.5వేల నుంచి రూ.10వేలు డిమాండ్
సదరంలో దళారుల కొత్త పంథా
అనంతపురం వైద్యం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వైకల్య ధృవీకరణ పత్రాల కోసం సదరం స్లాట్ బుకింగ్‌లో దళారులు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తొలుత స్లాట్‌లను బ్లాక్ చేసి, డబ్బులిచ్చిన వారికి బుకింగ్ చేశారు. జిల్లాలో స్లాట్‌లన్నీ భర్తీ అయ్యాయి. దళారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ట్రాన్సఫర్ పేరుతో దరఖాస్తుదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్లాట్ బుకింగ్ చేసి, తర్వాత జిల్లాకు ట్రాన్సఫర్ చేయిస్తామని నమ్మబలుకుతున్నారు. అందుకుగాను రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. దళారులను సంప్రదించాలని దరఖాస్తుదారులకు మీసేవ కేంద్రాల సిబ్బందే సూచిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రెండ్రోజుల్లోనే ఫుల్
ఉమ్మడి జిల్లావాసులు ఆధార్ అడ్రస్ మేరకు సంబంధిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదరం క్యాంపులకు స్లాట్‌బుకింగ్ చేసుకోవాలి. విభిన్న ప్రతాభావంతులకు వ్యయప్రాయాసలను తగ్గించేందుకు ఈ వెసులుబాటు కల్పించారు. సదరం క్యాంపు నిర్వహించే ఆస్పత్రుల్లో వైద్యుల సంఖ్యను బట్టి స్లాట్ల ఖాళీలను రూపొందించారు. ఆ మేరకు స్లాట్లను దళారులు డబ్బులిచ్చిన వారికి బుకింగ్ చేయించుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా సదరం క్యాంపుల ఆస్పత్రుల్లోని స్లాట్లు శుక్ర, శనివారాల్లోనే భర్తీ అయ్యాయి. దళారులను సంప్రదించని వారికి సచివాలయ, మీసేవా కేంద్రాల సిబ్బంది ఇతర జిల్లా, ప్రాంతాల్లోని సదరం క్యాంపులకు స్లాట్‌లను బుకింగ్ చేస్తున్నారు. ఇదేంటని బాధితవర్గాలు ప్రశ్నిస్తే.. ‘ఏం ఫర్వాలేదనీ, కొన్నిరోజుల తరువాత జిల్లాలోనే ఖాళీ అవుతాయనీ, అప్పుడు ట్రాన్సఫర్ చేయించుకోవచ్చ’ని సలహాలిస్తున్నారు. దళారులను సంప్రదిస్తే వారే.. అధికారుల ద్వారా ట్రాన్సఫర్ చేయిస్తారని స్లాట్‌బుకింగ్ చేసిన సిబ్బంది చెబుతున్నారని బాధితులు పేర్కొంటున్నారు.
రూ.5వేల నుంచి రూ.10వేలు డిమాండ్..
ఉమ్మడి జిల్లాలో 14 ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్యశాఖ సదరం క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ క్యాంపుల్లో ఉమ్మడి జిల్లాకు సరిపడా స్లాట్‌లు రూపొందించలేదు. దరఖాస్తుదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, సదరం స్లాట్ బుకింగ్ ద్వారా దండుకోవడానికి దళారీలు వెనకాడటంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో స్లాట్ బుకింగ్‌కు రూ.1500 నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక్కడ సాట్లు భర్తీ అయితే ఇతర జిల్లాల్లో బుకింగ్ చేసి తిరిగి ఈప్రాంత సదరం క్యాంపు ఆస్పత్రులకు ట్రాన్సఫర్ చేయిస్తున్నారు. ఒక్కో ట్రాన్సఫర్‌కు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు డిమాండ్ చేస్తున్నారని బాధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
మీ‘సేవ’లోనే...
మూడు నెలలకోసారి సదరం స్లాట్‌బుకింగ్ అవకాశం వస్తుంది. సదరం సర్వర్ ఓపెన అయిన గంటల్లోనే మొత్తం స్లాట్‌లు బుకింగ్ అవుతున్నాయి. దీంతో సచివాలయాలకెళ్లి స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది. అత్యధిక స్లాట్‌లు మీసేవ కేంద్రాల్లో బుకింగ్ అవుతుండడమే ఇందుకు కారణం. సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఉదయం 10 గంటలకు డ్యూటీలకు వస్తారు. ఇదే అదనుగా భావించి మీసేవ కేంద్రాల్లో ఉదయం 10 గంటల్లోపే స్లాట్‌లను భర్తీ చేస్తున్నారు. దళారీలు అత్యధికంగా మీసేవ ద్వారానే అక్రమాలకు పాల్పడుతున్నారు. సచివాలయాలకు కాళ్లరిగేలా తిరగడం మినహా పనికావడంలేదని బాధితులు వాపోతున్నారు.
దళారీలను నమ్మవద్దు
సదరం స్లాట్ బుకింగ్ కోసం దళారులను నమ్మవద్దు. అక్రమాలకు పాల్పడే దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా సిఫార్సు చేస్తాం. అర్హులైన దివ్యాంగులు అందరికీ సదరం స్లాట్‌బుకింగ్ చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఇందులో భాగంగానే సచివాలయాల సందర్శనకెళ్లి విభిన్న ప్రతిభావంతులకు అవగాహన కల్పిస్తున్నాం.
-నారాయణస్వామి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల కార్పొరేషన చైర్మన