Share News

మామిడి రైతులకు మంచి రోజులు!

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:49 AM

మామిడి రైతులకు ఇక మంచి రోజులు రానున్నాయి. మల్లవల్లిలోని కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ) యూనిట్‌ మార్చిలో అందుబాటులోకి రాబోతోంది. మామిడి సీజన్‌లో పల్పీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను ఏపీఐఐసీ అధికారులు చేపట్టారు. ఇదే జరిగితే ఈ మామిడి సీజన్‌లో రైతులకు బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో ఏడాదిగా మూలనపడి ఉన్న కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను పునః ప్రారంభించేందుకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృషి చేస్తున్నారు.

మామిడి రైతులకు మంచి రోజులు!

మార్చి కల్లా అందుబాటులోకి సీసీపీ!

- ఇక విదేశాలకు మామిడి పల్పీ ఎగుమతులు

- వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో ఏడాదిగా మూలన పడిన కోర్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌

- కాంట్రాక్టు సంస్థను సాగనంపేందుకు ఏపీఐఐసీ చర్యలు

- కొత్త కాంట్రాక్టర్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధం

- ప్లాంట్‌ పునరుద్ధరణకు కృషి చేస్తున్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ

మామిడి రైతులకు ఇక మంచి రోజులు రానున్నాయి. మల్లవల్లిలోని కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ) యూనిట్‌ మార్చిలో అందుబాటులోకి రాబోతోంది. మామిడి సీజన్‌లో పల్పీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను ఏపీఐఐసీ అధికారులు చేపట్టారు. ఇదే జరిగితే ఈ మామిడి సీజన్‌లో రైతులకు బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో ఏడాదిగా మూలనపడి ఉన్న కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను పునః ప్రారంభించేందుకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృషి చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

మల్లవల్లిలోని మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ (ఐపీ)కు అనుబంధంగా ఉంటున్న మెగా ఫుడ్‌ పార్క్‌లోని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల కామన్‌ అవసరాలైన పల్పీ, ప్యాకింగ్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ తదితరాలను తీర్చేందుకు వీలుగా సీపీసీని ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీపీసీని వివాదాస్పదం చేశారు. సీపీసీ లక్ష్యాన్ని నీరుగార్చేలా ఓ ఫ్లోర్‌ మిల్‌ యాజమాన్యానికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఫ్లోర్‌ మిల్‌ యాజమాన్యం దీనిని సరిగా నిర్వహించకపోవటంతో పాటు బిల్లుల పేరుతో సీపీసీ కార్యకలాపాలనే నిలుపుదల చేసింది. కిందటేడాది మ్యాంగో పల్పీ తీసి ఎగుమతులు చేయాలనుకున్న వ్యాపారులకు ఫ్లోర్‌ మిల్‌ యాజమాన్యం ఝలక్‌ ఇచ్చింది. ఆ తర్వాత పూర్తిగా ప్లాంట్‌ మూలన పడటంతో మెగా ఫుడ్‌ పార్క్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కూడా ఇబ్బందికరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. సీపీసీ పునఃప్రారంభానికి చర్యలు చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా కొంత కాలంగా మల్లవల్లిపై దృష్టి సారించి పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సీపీసీని కూడా మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏపీఐఐసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఫ్లోర్‌ మిల్‌ యాజమాన్యం, ఏపీఐఐసీ మధ్య వివాదం

కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)ను అందుబాటులోకి తీసుకురావాలంటే.. ప్రధానంగా ప్రస్తుత నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో దానిని సాగనంపే చర్యలను ఏపీఐఐసీ అధికారులు చేపడుతున్నారు. ఫ్లోర్‌ మిల్‌ యాజమాన్యం ఏపీఐఐసీ అధికారుల మీద ఒక సూట్‌ కూడా వేసింది. తాను గతంలో ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి కొన్ని పనులు చేసి ఉన్నానని, వాటికి డబ్బులు చెల్లించాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. ఏపీఐఐసీ అధికారులు మాత్రం ఈ పనుల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదన్న వాదనలు వినిపిస్తున్నారు. నిర్వహణ చేసినందుకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తామని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. పనులకు సంబంధించి మాత్రం సమాచారం లేనందున చెల్లించటం కుదరదని చెబుతున్నారు. ఇక్కడే ఉభయుల నడుమ వివాదం తలెత్తింది. ఈ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో మార్చి కల్లా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీఐఐసీ జెడ్‌ఎం సీతారాం ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

మామిడి సీజన్‌కు అందుబాటులోకి..

మామిడి సీజన్‌కు నూరు శాతం మల్లవల్లి సీపీసీ యూనిట్‌ అందుబాటులోకి రానుంది. ఉమ్మడి కృష్ణాజిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల మామిడి రైతాంగానికి కూడా సీపీసీ ఎంతగానో ఉపయోగపడుతుంది. నాణ్యమైన మామిడి పల్పీ ఎగుమతులకు విదేశాలలో మంచి డిమాండ్‌ ఉంది. ధర కూడా బాగా పలుకుతుంది. కిందటి సారి కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ అందుబాటులోకి రాకపోవటం వల్ల మామిడి రైతులు నిరుత్సాహం చెందారు. సీపీసీలో అయితే చాలా తక్కువ ధరకు మ్యాంగో పల్పీ తయారు చేయవచ్చన్న ఉద్దేశంతో రైతులు పెట్టుకున్న ఆశలు వమ్ము అయ్యాయి. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అసలు సీపీసీ ద్వారా ఏమేమి జరుగుతాయంటే..

కోర్‌ ప్రాసెసింగ్‌లో మెగా ఫుడ్‌పార్క్‌లోని ఆహార శుద్ధి పరిశ్రమలతో పాటుగా ఉద్యానపంటల రైతాంగానికి కూడా ఎంతగానో దోహద పడుతుంది. ఈ సీపీసీలో పల్పింగ్‌ లైన్‌ అనేది చాలా ప్రధానమైనది. గంటకు ఆరు టన్నుల టమాటా, 10 టన్నుల మామిడి, ఐదు టన్నుల బొప్పాయి, ఆరు టన్నుల జామకాయ, నాలుగు టన్నుల అరటి వంటి ఫ్రూట్‌ పల్ప్‌ను పల్పింగ్‌ లైన్‌ ద్వారా చేయవచ్చు. అలాగే ఫుల్లీ ఆటోమేటిక్‌ బ్రిక్‌ కార్టన్‌ ఫిల్లింగ్‌ అండ్‌ ప్యాకింగ్‌ లైన్‌ అనేది మరొకటి ఉంది. దీంట్లో 200 ఎంఎల్‌ జ్యూస్‌ ఉత్పత్తులను, కొబ్బరి నీటిని ప్యాకింగ్‌ చేస్తారు. ఈ సీపీసీలో 4000 మెట్రిక్‌ టన్నుల గోడౌన్‌ సదుపాయం కూడా ఉంది. ఇందులో అన్ని రకాల రా మెటీరియల్స్‌ను నిల్వ చేసుకోవచ్చు. మరో 3000 మెట్రిక్‌ టన్నుల కోల్డ్‌ స్టోరేజీ ఉంది. ఇందులో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పల్ప్‌ వంటివి నిల్వ చేయవచ్చు. ప్యాకింగ్‌ యూనిట్‌ కూడా ఉంది. ఈ యూనిట్‌లో 100 గ్రాముల నుంచి 2 కేజీల వరకు నిమిషానికి 50 - 70 ప్యాకెట్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Updated Date - Feb 12 , 2025 | 12:49 AM