వైభవం.. పార్వేట ఉత్సవం
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:16 AM
వేలాదిమంది భక్తుల నారసింహుని నామస్మరణతో అహోబిలం ప్రతిధ్వనించింది.

అహోబిలంలో కన్నులపండువగా ఉత్సవం
కొండదిగొచ్చిన జ్వాలా నృసింహుడు
దిగువ అహోబిలంలో అన్న కూటోత్సవం, కుంభ హారతి
ఉత్సవ పల్లకిని సాగనంపిన చెంచులు
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), జనవరి 15(ఆంధ్రజ్యోతి): వేలాదిమంది భక్తుల నారసింహుని నామస్మరణతో అహోబిలం ప్రతిధ్వనించింది. పల్లకిపై కొలువుదీరిన అహోబిలేశుని దర్శనంతో భక్తజనం మైమరచిపోయింది సంక్రాంతి తర్వాత కనుమ రోజు ఆనవాయితీగా నిర్వహించే నృసింహుని పార్వేట ఉత్సవం బుధవారం వైభవంగా సాగింది. సకల దేవతలు హాజరయ్యే తమ కల్యాణోత్సవానికి భక్తులంతా తరలి రావాలని ఆహ్వానించేందుకు సాక్ష్యాత్తు అహోబిలేశుడు గ్రామాలకు పయనమయ్యాడు. ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహ స్వామి మకర సంక్రాతి పర్వదినాన దిగువ అహోబిలం చేరుకున్నాడు. చెంచు మహిళలు విల్లంభులతో స్వామివారి పల్లకి వెంట సంప్రదాయ నృత్యం చేశారు. కొండదిగిన జ్వాలా నరసింహస్వామికి అహోబిలం మఠం స్థాపనాచార్యులు ఆదివన శఠగోప యతీంద్ర మహాదేశికన మూర్తిస్వరూపుడు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తాంబూలం సమర్పించి సమస్త రాజోపచారములచే దిగువ అహోబిలానికి తీసుకువచ్చి విశేష పూజలు నిర్వహించారు.
భక్తుల చెంతకు పయనమైన దేవదేవుడు
వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య 45 రోజుల పాటు 32 గ్రామాల్లో భక్తులకు దర్శనభాగ్యం కలిగించేందుకు దేవదేవుడు పయనమయ్యాడు. దిగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులను పట్టు వసా్త్రలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి శాసో్త్రక్తంగా అన్నకూటోత్సవం నిర్వహించారు. స్వామివార్లకు నివేదించిన అన్నాన్ని చెంచులు, గుడికట్టు, ఆయకట్టు, కర్ణం, రెడ్డి, బోయిలకు పంచిపెట్టారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన, వేద పండితులు కుంభహారతి నిర్వహించారు. అనంతరం జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పార్వేట పల్లకిలో కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అశేష భక్తజన సందోహం మధ్య స్వామివారి పార్వేట పల్లకి దిగువ అహోబిలం నుంచి బయలుదేరుతుండగా చెంచులు విల్లంభులు సంధిస్తూ.. మహిళలు సంప్రదాయ నృత్యం చేస్తూ పార్వేట పల్లకిని సాగనంపారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన, మణియార్ సౌమ్య నారాయణన, ఆలయ మేనేజర్ మురళీధరన, సీఏవో రామ మోహన, వేద పండితుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా, ఆళ్లగడ్డ డీఎస్పీ రవి కుమార్, రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి సబ్ డివిజనలోని పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. శ్రీవారికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పట్టువసా్త్రలు సమర్పించారు. పార్వేట పల్లకిలో కొలువైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులకుఎమ్మెల్యే విశేష పూజలు నిర్వహించారు.