Child Kidnapping: తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తె కిడ్నాప్
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:51 AM
తండ్రి అప్పు తీర్చలేదని ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల ఆయన కుమార్తెను ఓ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఒంగోలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
సీసీ ఫుటేజీతో స్వల్ప వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
తల్లిదండ్రుల చెంతకు బాలిక.. అదుపులో ఫైనాన్స్ వ్యాపారి
ఒంగోలు క్రైం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): తండ్రి అప్పు తీర్చలేదని ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల ఆయన కుమార్తెను ఓ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఒంగోలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ దామోదర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మువ్వావారిపాలేనికి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారి పనులకు తిరుపతి వలస వెళ్లాడు. ఆసమయంలో తిరుపతికి చెందిన ఆర్.ఈశ్వరరెడ్డి వద్ద రూ.5లక్షలు అప్పుతీసుకున్నాడు. కొంతకాలంగా ఆ బాకీ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం చీమకుర్తి వచ్చిన ఈశ్వర్‌రెడ్డి నేరుగా శ్రీనివాసరెడ్డి కుమార్తె చదువుకునే పాఠశాల వద్దకు వెళ్లాడు. అక్కడ స్వాతంత్య్రదిన వేడుకలకు హాజరై బయటకు వస్తున్న ఆ బాలికకు.. ‘మీ నాన్న ఇంటికి తీసుకురమన్నాడ’ంటూ మాయమాటలు చెప్పి మధ్యాహ్నం 12.30 గంటలకు మోటారు సైకిల్‌పై ఎక్కించుకున్నాడు. స్వీట్లు కొనిస్తానని చెప్పి దారిమళ్లించి ఒంగోలుకు తీసుకువచ్చాడు. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డయింది. అక్కడి నుంచి శ్రీనివాసరావుకు ఫోన్‌చేసి ‘మీ కుమార్తెను తీసుకెళుతున్నా.. నాకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వకపోతే చంపేస్తా’ అని బెదిరించాడు. వెంటనే శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అప్రమత్తమయ్యారు. ఎస్పీ దామోదర్ స్వీయ పర్యవేక్షణలో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్ తిరుపతికి చెందిన ఆర్.ఈశ్వరరెడ్డిగా గుర్తించారు. అతడి ఫోన్ ట్రాక్ చేసి నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని కె.బిట్రగుంట వద్ద మధ్యాహ్నం 2.30 గంటలకు అదుపులోకి తీసుకొన్నారు. కిడ్నాప్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.