ఐదేళ్ల బాలికకు జీబీఎస్ !
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:45 AM
మహారాష్ట్రలోని పుణెలో వెలుగుచూసి.. ఏడుగురి ప్రాణాలను బలి తీసుకున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) ఏలూరు జిల్లాను తాకింది.

యర్రగుంటపల్లిలో నిర్ధారణ
విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. చికిత్స
ఇది సాధారణ వ్యాధే.. ఆందోళన వద్దంటున్న వైద్యాధికారులు
ఏలూరు అర్బన్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని పుణెలో వెలుగుచూసి.. ఏడుగురి ప్రాణాలను బలి తీసుకున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) ఏలూరు జిల్లాను తాకింది. చింతలపూడి మండలం యర్ర గుంటపల్లిలో ఐదేళ్ల బాలికకు ఈ లక్ష ణాలు ప్రాథమి కంగా నిర్ధారణ అయ్యింది. 15 రోజులుగా ఆమెకు కండరాలు పట్టే యడంతో కుటుంబ సభ్యులు స్థానిక వైద్యు లను సంప్రదించారు. బాలిక వెన్ను నుంచి నీరు తీసి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్(సీఎస్‌ఎఫ్) పరీక్ష చేయగా జీబీఎస్ లక్షణాలుగా నిర్ధారణ అయిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వైలెన్స్ ఆఫీసర్(ఎన్‌సీడీ) డాక్టర్ నరేంద్రకృష్ణ వెల్లడించారు. ప్రస్తు తం బాలికను విజయ వాడ ప్రభుతాసుపత్రి పీడియాట్రిక్స్ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉందని, తదుపరి వైద్య పరీక్షలు, వేరియంట్, వైరల్ లోడ్ పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ను బెంగళూరు లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు వివరించారు. ముందు జాగ్రత్తల్లో భాగంగా బాలిక నివసించే ప్రాంతంలో తాగునీటి వనరులు, పరిసరాల పరిశుభ్రతలపై చర్యలు తీసుకోవడంతోపాటు, ర్యాండమ్‌గా స్థానికంగా వున్న నలుగురి నుంచి మలం శాంపిల్స్‌ను సేకరించి మోషన్ టెస్టు కోసం ల్యాబ్‌కు పంపించినట్టు తెలిపారు.
ఏమిటీ జీబీఎస్ ?
జీబీఎస్ సాధారణంగా వ్యాపించేదే అయినా ఒకరి నుంచి ఒకరికి సోకే అంటు వ్యాధి కాదు. రోగ నిరోధక శక్తి తక్కువగా వున్న వ్యక్తుల్లో తొలుత నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనిని నరాల సంబంధిత వ్యాధిగా పరిగణించవచ్చు.
కలుషిత నీరు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. మెదడు నుంచి కాళ్ల వరకు నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడటం, వీపు భాగం, చేతులు, మెడ, కండరాలు.. దేహమంతా అచేతనం కావడం జరుగుతాయి. కండరాల అచేతనం అందరిలో ఒకేలా ఉండబోదు.
ప్రతీ అవయవాన్ని నియంత్రించే మెదడు ద్వారా శరీరంలోని ప్రతీ భాగానికి ఆదేశాలను పంపే నరాలపై ఉండే మైలీన్ పొర దెబ్బ తిని మెదడు నుంచి వచ్చే సంకేతాలు అందకపోవడంతో అవయవాలు చచ్చుబడి అచేతనమవుతాయి.
నేడు ఇంటింటా సర్వే
జీబీఎస్ లక్షణాలు గల వారిని గుర్తించేందుకు శనివారం నుంచే ఇంటింటా సర్వేను చేపట్టాలని డీఎంహెచ్‌వో డాక్టర్ మాలిని జిల్లాలోని 64 పీహెచ్‌సీల వైద్యాధికా రులను ఆదేశించారు. యర్రగుంటపల్లిలో మెడికల్ క్యాంపును ప్రారంభించడంతోపాటు, వైద్య సిబ్బంది అందరిని రంగంలోకి దించారు. ఇంటింటికీ పంపి జీబీఎస్ లక్షణాలుగల వారెవరైనా ఉన్నారా ? అనే కోణంలో నిశిత పరిశీలనను చేపట్టారు.