Share News

కబ్జాలు, దందాలతో గన్నవరాన్ని నాశనం చేశారు

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:59 AM

‘వంశీ అరెస్టు సక్రమమే. మహానుభావులు గెలిచిన గన్నవరం గడ్డ మీద కబ్జాలు, దందాలు, అక్రమాలు చేశారు. ఎందరి మీదో అక్రమ కేసులు బనాయించారు. చేసిన పాపాలకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వంశీపై జగన్‌, ఇతర నేతలు మొసలి కన్నీరు కారుస్తూ ట్వీట్లు పెట్టడం కాదు. దమ్ముంటే బయటకు వచ్చి మగాళ్లలా మాట్లాడాలి. వంశీని నేనెప్పుడూ రాజకీయ ప్రత్యర్థిగానే చూశా. కక్ష పూరితంగా చూడలేదు. ఆయన నన్ను శత్రువుగానే చూశాడు. ఐదేళ్లు వాళ్లు విధ్వంసం చేస్తే నేను అభివృద్ధి చేస్తున్నా’ అని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. వంశీ అరెస్టు నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావుపై వైసీపీ మూకలు సోషల్‌ మీడియా వేదికగా దాడి చేస్తున్న నేపథ్యంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు. ఆయన మాటల్లోనే ..

కబ్జాలు, దందాలతో గన్నవరాన్ని నాశనం చేశారు

- చేసిన పాపాలకే శిక్ష అనుభవిస్తున్నారు.. మేం కక్ష సాధించటం లేదు

- భూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారు.. వాటిపై విచారణను కోరుతున్నా

- ఎమ్మెల్యే కాగానే గ్రీవెన్స్‌ నిర్వహిస్తే 5 వేల మంది వచ్చారు

- అన్నీ భూ కబ్జా కేసులే.. వీటిలో కొన్నింటిని విచారించాం

- నాపై ట్వీట్లు చేసే వైసీపీ నేతలు కలుగులో కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలి

-‘ఆంధ్రజ్యోతి’తో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంక ట్రావు

‘వంశీ అరెస్టు సక్రమమే. మహానుభావులు గెలిచిన గన్నవరం గడ్డ మీద కబ్జాలు, దందాలు, అక్రమాలు చేశారు. ఎందరి మీదో అక్రమ కేసులు బనాయించారు. చేసిన పాపాలకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వంశీపై జగన్‌, ఇతర నేతలు మొసలి కన్నీరు కారుస్తూ ట్వీట్లు పెట్టడం కాదు. దమ్ముంటే బయటకు వచ్చి మగాళ్లలా మాట్లాడాలి. వంశీని నేనెప్పుడూ రాజకీయ ప్రత్యర్థిగానే చూశా. కక్ష పూరితంగా చూడలేదు. ఆయన నన్ను శత్రువుగానే చూశాడు. ఐదేళ్లు వాళ్లు విధ్వంసం చేస్తే నేను అభివృద్ధి చేస్తున్నా’ అని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. వంశీ అరెస్టు నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావుపై వైసీపీ మూకలు సోషల్‌ మీడియా వేదికగా దాడి చేస్తున్న నేపథ్యంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు. ఆయన మాటల్లోనే ..

-ఆంధ్రజ్యోతి, విజయవాడ:

కుప్పలు తెప్పలుగా భూ కబ్జాలపై అర్జీలు

నియోజకవర్గ స్థాయిలో గీవెన్స్‌ నిర్వహిస్తే ఐదువేల మంది వచ్చారు. ఎక్కువుగా భూ కబ్జాలపైనే ఫిర్యాదులు వచ్చాయి. కొన్నిటిపై విచారణ కూడా జరిగింది. నూరుశాతం భూ కబ్జాలకు పాల్పడ్డారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గన్నవరం, బాపులపాడు మండలాలకు నరసింహారావు అనే తహసీల్దార్‌ను ఒక్కడినే పెట్టి ఇష్టానుసారంగా భూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారు. జగనన్న ఇళ్ల పట్టాల కోసం భూములను సేకరించే విషయంలో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారు. అప్పటి తహసీల్దార్‌, జేసీ మీద కూడా విచారణ జరిపితే భూకబ్జాల బాగోతం వెలుగులోకి వస్తుంది. ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. వాటిపైనా విచారణ జరుగుతోంది.

పరిశ్రమలను తన్ని తరిమేశారు

టీడీపీ ప్రభుత్వంలో మల్లవల్లిలో అశోక్‌ లేల్యాండ్‌ ఏర్పాటు చేశారు. దానిని వారు పట్టించుకోకుండా తన్ని తరిమేశారు. నేను ఎన్నికల ముందు అశోక్‌ లేల్యాండ్‌ను తిరిగి తీసుకువస్తానని చెప్పా. అన్నట్టుగానే మళ్లీ పునఃప్రారంభమయ్యేలా చర్యలు చేపడుతున్నా. మల్లవల్లిలో భూముల ధరలను భారీగా పెంచేశారు. ఎంఎస్‌ఎంఈలు ఎన్నింటినో సాగనంపారు. పరిశ్రమలు అనేవి లేకుండా పోయాయి. మల్లవల్లిలో పరిశ్రమలను తీసుకువచ్చే పని చేపడుతున్నా. సుప్రీం సొల్యూషన్స్‌ అనే పెద్ద సంస్థ త్వరలో వస్తోంది. మరో 479 ఎకరాలతో మల్లవల్లి విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 5 వే ల నుంచి 15 వేల మంది ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం.

కామన్‌సైట్లను కబ్జా చేశారు

నియోజకవర్గంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా చేశారు. వెంచర్లలో కామన్‌ సైట్లు లాగేసుకుని అమ్ముకున్నారు. ఎంతో మంది చేతులు మారిపోయాయి. విజయవాడ రూరల్‌ మండలంలో అయితే కామన్‌ సైట్లు లేకుండా పోయాయి.

కొండలను కరిగించేశారు

నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ తారాస్థాయిలో జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు అక్రమ క్వారీయింగ్‌పై విజిలెన్స్‌ విచారణ జరిపించారు. విచారణలో ఎన్నో అంశాలు నిగ్గు తేలాయి. వాటిలో కొందరి పేర్లు బయటకు వచ్చాయి. మరికొందరు పేర్లు బయటకు రాలేదు. పూర్తి డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. అక్రమాలకు పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయి. అలాగే భూ కబ్జాలు, భూ రికార్డుల ట్యాంపరింగ్‌ వంటి వాటిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.

అక్రమ కేసులు ఇష్టానుసారం పెట్టారు.. నేను ఒక్కటి కూడా పెట్టలేదు

ఐదేళ్లలో ఆయన సొంత పార్టీ నేతలతో పాటు, మా పార్టీ నేతలపై కూడా ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తర్వాత అక్రమ కేసులు ఎవరి మీద పెట్టనని చెప్పా. నా మాటకు కట్టుబడి ఉన్నా. వైసీపీ నాయకులు ఒక్కరిపై కూడా నేను అక్రమ కేసు పెట్టలేదు. వంశీ హయాంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టారో అందరికీ తెలుసు.

అధికారం పోయిన తర్వాత కూడా దందాలు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దందాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన కాంట్రాక్టు పనులను వంశీ అనుచరులు కడియాల సతీష్‌, రఘు దక్కించుకున్నారు. భారీగా దొంగ బిల్లులు పెట్టారు. దీనిపై నేను విచారణకు డిమాండ్‌ చేస్తున్నా.

నాడు జగన్‌ మీదనే కేసు పెట్టిన వంశీ.. ఆయనకే నేడు జగన్‌ వత్తాసు

మినుము పంటను తొక్కుకుంటూ వెళ్లాడని జగన్‌ మీదనే వంశీ కేసు పెట్టాడు. అదే వంశీ అరెస్టు అక్రమం అంటూ జగన్‌ ట్వీట్లు చేస్తున్నాడు. కొడాలి నాని వంటి వాళ్లు ట్వీట్లతో కూతలు కూస్తున్నారు. నేనొక్కటే చెబుతున్నా.. మగాడిలా బయటకు వచ్చి మాట్లాడమంటున్నా. వంశీని నేనెప్పుడూ రాజకీయ ప్రత్యర్థిగానే చూశా. ఆయన నన్ను శత్రువుగానే చూశాడు. ఇప్పుడు కూడా వంశీ చేసిన నిర్వాకాల వల్లనే ఆయన అరెస్టు అయ్యాడు తప్పితే మేమేదో కావాలని చేయించింది కాదు.

నియోజకవ ర్గాన్ని గాడిలో పెడుతున్నా

నియోజకవర్గాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నా. మల్లవల్లిలో కొత్తగా పరిశ్రమలు తీసుకు వచ్చి స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నా. అతి త్వరలో సాకారం అవుతుంది. జాబ్‌ మేళాల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నా. మేథ దగ్గర ఐఐటీ గచ్చిబౌలిని తీసుకురావాలని ప్రయత్నం చేశా. 30 ఎకరాల భూమి అవసరమైంది. తీరా చూస్తే భూములు కొన్ని ఆక్రమణలలో ఉన్నాయని తేలింది. ఐబీఎస్‌ వంటి కళాశాలలను తీసుకురావాలన్నది నా ఉద్దేశ్యం. హెచ్‌సీఎల్‌ నుంచి సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ తీసుకు వచ్చి గన్నవరం అభివృద్ధికి గతంలో కృషి చెయ్యలేదు. నేను ఆ పని చేస్తున్నా. గతంలో నేను కేడీసీసీ బ్యాంకును ఏ విధంగా అభివృద్ధి చేశానో.. అదే తరహాలో గన్నవరం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసి మోడల్‌గా నిలపాలన్నది నా ఆలోచన.

Updated Date - Feb 17 , 2025 | 12:59 AM