‘కబుర్ల దేవత’కు కేంద్ర బాల పురస్కారం
ABN , Publish Date - Jun 19 , 2025 | 06:29 AM
కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య, యువ పురస్కారాలను ప్రకటించింది. గంగిశెట్టి శివకుమార్ రచించిన ’కబుర్ల దేవత‘ పుస్తకానికి బాల సాహిత్య పురస్కారం వచ్చింది. ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది.
మైరావణ నవలకు యువ పురస్కారం
అవార్డులు ప్రకటించిన సాహిత్య అకాడమీ
న్యూఢిల్లీ, హైదరాబాద్ సిటీ, నెల్లూరు (సాంస్కృతికం), జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య, యువ పురస్కారాలను ప్రకటించింది. గంగిశెట్టి శివకుమార్ రచించిన ’కబుర్ల దేవత‘ పుస్తకానికి బాల సాహిత్య పురస్కారం వచ్చింది. ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది. అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఎగ్జిక్యూటివ్ బోర్డు పలు భాషల్లో వెలువడిన ఉత్తమ రచనలను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారం ప్రకటించలేదు. పురస్కారాలను త్వరలో ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. జ్ఞాపికతో పాటు రూ.50 వేల నగదు అందిస్తామని అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రసాద్ సూరిది విశాఖపట్నం కాగా, గంగిశెట్టి శివకుమార్‌ది నెల్లూరు. తెలుగు భాషకు సంబంధించి బాల సాహిత్య పురస్కారాలకు జ్యూరీ సభ్యులుగా కన్నెగంటి అనసూయ, ఎం. భూపాల్ రెడ్డి, కిలపర్తి దాలినాయుడు ఉన్నారు. యువ పురస్కారాలకు జ్యూరీ సభ్యులుగా జీఎస్ చలం, కుప్పిలి పద్మ, పెద్దింటి అశోక్ కుమార్ వ్యవహరించారు.
పాతికేళ్లకే పురస్కారం
సురాడ ప్రసాద్ (కలం పేరు ప్రసాద్ సూరి) 2000లో విశాఖ జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి గ్రామంలో జన్మించారు. రాంబిల్లిలోనే పదో తరగతి వరకు చదివారు. యలమంచిలి ప్రభుత్వకాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బీఎ్‌ఫఏ, పెయింటింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం గుజరాత్‌లోని బరోడా నగరంలో మహారాజా సాయాజిరావు యూనివర్సిటీలో ఎంఏ ఆర్కియాలజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. 18వ ఏట నుంచే సాహిత్యం, చిత్రకళ, చరిత్ర, సినిమా రంగంపై ఆయనకు ఆసక్తి ఎక్కువ. ‘మైరావణ’ ఆయన మూడోనవల. ‘మై నేమ్ ఈజ్ చిరంజీవి’, ‘బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ అనేది మిగతా నవలలు. చేపల వేట జీవనాధారంగా ఉన్న వాడ బలిజల వలస జీవిత కథలకు జానపద వీరగాథను జోడించి రాసిన నవలే మైరావణ. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం వాడ బలిజల జీవితాలను తొలిసారిగా సాహిత్యంలో నమోదు చేసింది. ఈ అవార్డు సాహిత్యం పట్ల తన బాధ్యతను మరింత పెంచింది అని రచయిత ప్రసాద్ సూరి అన్నారు. తాను ఎంతో అధ్యయనం చేసి ఈ నవల రాశానని తెలిపారు.
బాల సాహిత్యంలో దిట్ట...
ఐదు దశాబ్దాలకు పైగా సాహిత్య సేవ చేస్తున్న గంగిశెట్టి శివకుమార్ చిన్నారుల కోసం 400కుపైగా కథలు రాశారు. నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన గంగిశెట్టి 54 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో ఉపాధ్యాయునిగా 2012లో ఉద్యో గ విరమణ పొందారు. తొలినాళ్లలో ‘చందమామ’కు ఉప సంపాదకునిగా సేవలందించారు. పిల్లల కథలపై ఎస్వీ వర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. వీరి కథలు పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. పురస్కారాలు పొందిన ప్రసాద్ సూరి, గంగిశెట్టిలకు సాహిత్య ప్రముఖులు ఛాయా మోహన్, తాడి ప్రకాశ్, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, వల్లూరు శివప్రసాద్, పెనకొండ లక్ష్మీనారాయణ, పెరుగు రామకృష్ణ, టేకుమళ్ల వెంకటప్పయ్య తదితరులు అభినందనలు తెలిపారు.