Free Bus Ride Sparks Joy: ఉచిత బస్..జోష్
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:49 AM
బెజవాడ రోడ్లపై ఉచిత బస్ సందడి చేసింది. మహిళల్లో కొత్త జోష్‌ను నింపింది. బెజవాడలో జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే స్ర్తీ శక్తి పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు ఉండవల్లి ...
ఉండవల్లి నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించి వచ్చి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
విజయవాడ, మంగళగిరి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): బెజవాడ రోడ్లపై ఉచిత బస్ సందడి చేసింది. మహిళల్లో కొత్త జోష్‌ను నింపింది. బెజవాడలో జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే స్ర్తీ శక్తి పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి బస్సులో ప్రయాణించి వచ్చారు. ఐదు రకాల బస్సులకు ఆయన జెండా ఊపారు. ఈ ఐదు బస్సులను మహిళల కోసం స్పెషల్‌గా నడిపారు. అంతకుముందు.. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సును విజయవాడ నుంచి ముఖ్యమంత్రి రాక కోసం ఉండవల్లికి అధికారులు పంపించారు. ఈ బస్సుకు మహిళా కండక్టర్‌గా కె.దుర్గాభవాని వ్యవహరించారు. ఉండ వల్లిలో అప్పటికే బస్సు కోసం సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌లు వేచి ఉన్నారు. బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండవల్లి సెంటర్‌లోని బల్లమీద కూర్చున్నారు. వీరితో పాటు బస్సులో ప్రయాణించాల్సిన మహిళలు కూడా వారితో పాటు కూర్చున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు బస్ రాగానే ముందుగా మహిళలు ఎక్కారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ , లోకేశ్, మాధవ్‌లు బస్సెక్కారు. బస్సెక్కిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కండక్టర్ టికెట్లు కొట్టారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇచ్చారు. ఆ టికెట్లను చంద్రబాబు బస్సులో ఎక్కిన మహిళలకు స్వయంగా అందించారు. పవన్‌కల్యాణ్ బస్సులో కొద్ది నిమిషాలు లేచి నుంచొని పలువురు మహిళలతో సరదాగా కరచాలనం చేసి వారిని ఉత్సాహపరిచారు. 50 నిమిషాలు సీఎం బస్సులోనే ప్రయాణించారు. ఈ విషయం తెలుసుకుని ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి అభివాదం చేశారు.