Share News

విజయవాడ నుంచి రాజధానికి రాజమార్గం

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:14 AM

విజయవాడ వైపు నుంచి ప్రజలు రాజధానికి వెళ్లడానికి విశాలమైన రోడ్డు సిద్ధం కానుంది. రాజధాని అమరావతిలోని కృష్ణా కర కట్ట రోడ్డును నాలుగు వరసలుగా విస్తరించటానికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్‌) టెండర్ల ప్రక్రియకు రెడీ అవుతోంది. క్షేత్రస్థాయిలో కరకట్ట

విజయవాడ నుంచి రాజధానికి రాజమార్గం

నాలుగు లేన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణ

అలైన్‌మెంట్‌ పూర్తి.. క్షేత్రస్థాయిలో పెగ్‌ మార్కింగ్‌ పనులు

భూములు ఇవ్వడానికి రైతులు సంసిద్ధత

మంత్రి నారాయణతో త్వరలో ఏడీసీఎల్‌ అధికారుల సమావేశం

ముఖ్యమంత్రితో చర్చించాక నోటిఫికేషన్‌ విడుదల

విజయవాడ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): విజయవాడ వైపు నుంచి ప్రజలు రాజధానికి వెళ్లడానికి విశాలమైన రోడ్డు సిద్ధం కానుంది. రాజధాని అమరావతిలోని కృష్ణా కర కట్ట రోడ్డును నాలుగు వరసలుగా విస్తరించటానికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్‌) టెండర్ల ప్రక్రియకు రెడీ అవుతోంది. క్షేత్రస్థాయిలో కరకట్ట రోడ్డుకు పెగ్‌ మార్కింగ్‌ పనులు చేపడుతోంది. దాదాపు అలైన్‌మెంట్‌ను కూడా సిద్ధం చేసింది. టెండర్ల ప్రక్రియ చేపట్టేలోపు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని ఏడీసీఎల్‌ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కరకట్ట విస్తరణకు సంబంధించి ఇరిగేషన్‌ అధికారులు ఇచ్చే రిపోర్టుపై మంత్రి నారాయణతో ఏడీసీఎల్‌ అధికారులు చర్చించనున్నారు. కరకట్టను రెండు, నాలుగు వరసలుగా విస్తరించటానికి వీలుగా ఎంత భూమి అవసరమనేది అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సీఆర్‌డీఏ ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ను ఏడీసీఎల్‌ అధికారులు కోరారు. రెండు వరసలకైతే భూ సేకరణకు ఇబ్బంది లేదని తెలుస్తోంది. నాలుగు వరసలకు మాత్రం తప్పనిసరిగా భూములను సేకరించాల్సి ఉంటుంది. ఏడీసీఎల్‌ సీఎండీ లక్ష్మీ పార్థసారథి ఇప్పటికే పలుమార్లు కరకట్ట రోడ్డును పరిశీలించారు. ఇంజనీరింగ్‌ అధికారుల సమీక్షలో నాలుగు వరసలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రైతులందరితో ముఖాముఖి మాట్లాడుతూ భూ అవసరాలను వివరించారు. దాదాపు 90 శాతానికి పైగా రైతులు తమ భూములు ఇవ్వటానికి సానుకూలంగానే ఉన్నారు. నాలుగు వరసలుగా విస్తరించటానికి మరో 10 ఎకరాలను సేకరించగలిగితే సరిపోతుందని తెలుస్తోంది. అలైన్‌మెంట్‌పై మంత్రి నారాయణతో చర్చించాక చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కూడా కరకట్ట విస్తరణ అంశాన్ని ఏడీసీఎల్‌ అధికారులు చర్చించనున్నారు. భూములకు సంబంధించి సమీకరణ విధానంలో వెళ్లాలా? సేకరణ విధానంలో వెళ్లాలా? అనే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించాక నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఏడీసీఎల్‌ అధికారులు భావిస్తున్నారు.


వరదలను తట్టుకునేలా కరకట్ట బలోపేతం

కరకట్ట రోడ్డు విస్తరణను చేపడుతున్నట్టు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. అట్టహాసంగా భూమిపూజ చేపట్టారు. రెండు వరసలకు కొంతమేర ఎర్త్‌ వర్క్‌ చేసి ఆపేశారు. భూ సేకరణ పేరుతో పనులు నిలిపేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని ఏడీసీఎల్‌ అధికారులు దృష్టిలో ఉంచుకున్నారు. నాలుగు వరసలుగా కరకట్ట రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికోసం కరకట్టను బలోపేతం చేయాల్సి ఉంటుంది. వరదలను తట్టుకునేలా ఒక బండ్‌గా దీనిని నిర్మించాలి. ఈ విషయంలో ఇరిగేషన్‌ అధికారుల అభిప్రాయాలు, సలహాలను కూడా తీసుకోవాలని ఏడీసీఎల్‌ అధికారులు భావిస్తున్నారు.


Also Read: అప్పు చేయడం తప్పు కాదు కానీ..

Updated Date - Feb 11 , 2025 | 04:14 AM