Share News

PSR Anjaneyulu: చూడమని చెప్పానంతే

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:38 AM

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టయిన మాజీ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులు, విచారణ అధికారులను దబాయించారనే ఆరోపణలు వెలువడ్డాయి. కేసు విషయమై కాంతిరాణా, విశాల్‌ గున్నీపై ఒత్తిడి చేశారని, దానికి సంబంధించిన విచారణలో అసహ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.

PSR Anjaneyulu: చూడమని చెప్పానంతే

వారితో నేను తప్పులు చేయించినట్లా?

కుక్కల విద్యాసాగర్‌ సాయం అడిగారు

ఆ కేసేమిటో చూడాలని రాణాకు చెప్పా

జత్వానీ అరెస్టుకు సహకరించాలని

ముంబై పోలీసులను కోరాను

రాణా, గున్నీ సీఎంవోకు రాక యాదృచ్ఛికమే

విచారణ సమయంలో పీఎస్సార్‌ జవాబులు

అధికారుల ముందు వింత వైఖరి

పేరుతో పిలుస్తూ.. ‘మహానుభావా’

అంటూ తోచినట్టు వ్యాఖ్యలు

మీరంతా దొంగలు అంటూ రుసరుసలు

విజయవాడ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘కుక్కల విద్యాసాగర్‌ అనే వ్యక్తి వచ్చి... తనకు సహాయం చేయాలని అడిగాడు. ఆ కేసు ఏదో చూడాలని అప్పటి విజయవాడ నగర కమిషనర్‌ కాంతిరాణాకు చెప్పాను. కిందివాళ్లు తప్పులు చేస్తే... నేనే చేయించినట్లా?’.. అని ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టయిన సీనియర్‌ ఐపీఎస్‌, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు విచారణ అధికారులను దబాయించినట్లు తెలిసింది. కాంతిరాణా, విశాల్‌ గున్నీ అడిగారు కాబట్టి...

జత్వానీ అరెస్టుకు సహకరించాల్సిందిగా ముంబై పోలీసులకు కూడా ఫోన్‌ చేసి కోరినట్లు అంగీకరించినట్లు సమాచారం. అదే సమయంలో... ఈ కేసులో నిందితుడైన ఆయన తానే ‘బాస్‌’ అన్నట్లుగా ప్రవర్తించినట్లు సమాచారం. పీఎస్సార్‌ను మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన అనంతరం... విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌, విజయవాడ సీఐడీ ఆర్‌వో ప్రసాద్‌ కలిసి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పీఎస్సార్‌ విచారణ అధికారులపై రుసరుసలాడుతూ, ‘మహానుభావా’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ, పేరుతో పిలుస్తూ వింతగా వ్యవహరించినట్లు సమాచారం. విచారణ సమయంలో... ‘తర్వాతిప్రశ్న ఏమిటో త్వరగా అడుగు ప్రవీణ్‌’ అని రెట్టించినట్లు తెలిసింది. విచారణలో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రిమాండ్‌ రిపోర్టును తయారు చేసి పీఎస్‌ఆర్‌ చేతిలో పెట్టినప్పుడు... దాన్ని చదువుకుని ‘మీరంతా దొంగలు..’ అని నిందిస్తూ సంతకం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... పీఎస్సార్‌ను అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన సమాధానాలు ఇవి...


కాదంబరి జత్వాని కేసు విషయంలో కాంతిరాణా, విశాల్‌గున్నీపై ఎందుకు ఒత్తిడి చేశారు?

చూడు ప్రవీణ్‌ (డీఐజీ).... నీ దగ్గరికి ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయమని అడిగితే ఏం చేస్తావు? ఆయన సమస్యలో న్యాయం ఉంటే సహాయం చేయాలని ఏ పోలీస్‌ అధికారికో, ఎస్‌హెచ్‌వోకో ఫోన్‌ చేసి చెబుతావు. అంతేకదా! ఫోన్‌ చేసినంత మాత్రాన కిందిస్థాయి అధికారులు చేసిన తప్పులు నువ్వు చేయించినట్టా? కుక్కల విద్యాసాగర్‌ నా దగ్గరికి వచ్చి ఒక మాటగా చెప్పమని అడిగారు. ఆ కేసు ఏమిటో చూడమని చెప్పాను. దానికి నేనెలా బాధ్యుడ్ని అవుతాను. మీరంతా దొంగలు.

కాంతిరాణా, గున్నీని సీఎంవోకు ఎందుకు పిలిపించారు?

నిఘా విభాగం అధిపతి హోదాలో ఏ విషయాన్నయినా అప్పట్లో సీఎంతో పంచుకునేవాడిని. ఇంతకుముందు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లుగా పనిచేసిన వారు కూడా ఇదే చేశారు. అక్కడికి కాంతిరాణా, విశాల్‌గున్నీ యాదృచ్ఛికంగా వచ్చి ఉంటారు.


జత్వానిపై కేసు నమోదు చేయాలని కాంతిరాణా, గున్నీలపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు?

కుక్కల విద్యాసాగర్‌ అనే వ్యక్తి నన్ను కలిసి తనకు వచ్చిన ఇబ్బంది చెప్పి సహాయం చేయాలని కోరారు. ఆయన కేసు ఏమిటో చూడాలని కాంతిరాణాకు సూచించాను.

ముంబై పోలీసులకు కూడా ఫోన్‌చేసి సహకరించాలని అడిగారు కాదా?

ముంబైలో ఉండే జత్వానిపై కేసు నమోదు చేశాం.. అరెస్టు చేయాల్సి ఉందని కాంతిరాణా, విశాల్‌గున్నీ నాకు తెలిపారు. వారిద్దరికి సహకారం అందించాల్సిందిగా ముంబై పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాను.


మీరు ఉపయోగించిన ట్యాబ్‌ ఎక్కడ?

సర్వీసులో ఉన్నంత వరకు సెల్‌ఫోన్‌ తప్ప ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌ ఏనాడూ ఉపయోగించలేదు. (మళ్లీ అదే ప్రశ్న అధికారి వేయగా) చెప్పాను కదా మహానుభావా! ఐదేళ్లపాటు నా వద్ద పనిచేసిన గన్‌మెన్‌, సీసీలు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారు. వారిని విచారిస్తే నేను ట్యాబ్‌ ఉపయోగించానో లేదో తెలుస్తుంది. అవసరమైతే అప్పుడు సీఎంగా ఉన్న జగన్‌ ఇంటి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించండి. అప్పటి సీఎంవోకు అనేకసార్లు వెళ్లినప్పుడు మీడియా షూట్‌ చేసింది. ఆ క్లిప్పింగ్‌లను పరిశీలిస్తే నా చేతిలో ట్యాబ్‌ ఉందో లేదో తెలుస్తుంది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 04:38 AM