Mining Extortion: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:21 AM
వైసీపీ మాజీ మంత్రి విడదల రజినిపై మైనింగ్ వ్యాపారాల నుంచి అవినీతి కోసం కోట్లు వసూలు చేసిన కేసులో ఏసీబీ విచారణ ప్రారంభించింది. ఆమె మరిది గోపిని, ఇతరులకు సహకరిస్తూ ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది.
హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని తాడేపల్లికి తరలించిన ఏసీబీ
యడ్లపాడు మైనింగ్ వ్యాపారులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమ వసూలు
బాధితుల ఫిర్యాదుతో విజిలెన్స్ విచారణ
రజిని సహా నలుగురిపై ఏసీబీ కేసు నమోదు
అర్ధరాత్రి దాటాక కోర్టు ముందుకు.. 14 రోజుల రిమాండ్
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినికి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) షాకిచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనింగ్ వ్యాపారులను బెదిరించి కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో ఆమె మరిది విడదల వేణు గోపీనాథ్ అలియాస్ గోపిని అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించి తాడేపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గురవారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం రాత్రి పొద్దుపోయాక ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఇంట్లో హాజరుపరిచారు. న్యాయాధికారి ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట (ప్రస్తుతం పల్నాడు జిల్లా) నియోజకవర్గం యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావును డబ్బు కోసం విడదల రజని బెదిరించారు (అప్పటికి ఆమె వైసీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు). వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణ ద్వారా ఐదు కోట్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రాంతీయ విజిలెన్స్ అధికారి పి.జాషువాతో పాటు తన మరిది గోపిని రంగంలోకి దించారు. పూర్తి అనుమతులతో 10.163 హెక్టార్లలో మైనింగ్ చేస్తున్నామని, అక్రమాలకు పాల్పడలేదని.. తామెందుకు 5 కోట్లు ఇవ్వాలని చలపతిరావు అభ్యంతరం చెప్పారు.
‘ఎమ్మెల్యే అడిగితే ఇవ్వాల్సిందే.. లేదంటే రూ.50 కోట్ల జరిమానా తప్పదు’ అని జాషువా బెదిరించారు. తన బృందంతోపాటు మైనింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లి స్టోన్ క్రషర్ కార్యాలయంలో 2020 సెప్టెంబరు 20న తనిఖీలు చేశారు. అనంతరం గుంటూరులోని తన కార్యాలయంలో జరిమానా విధించేందుకు అనుకూలంగా నివేదిక సిద్ధం చేయించి.. మరోమారు చలపతిరావును భయపెట్టి బేరమాడారు. విధిలేని పరిస్థితిలో రూ.2 కోట్లు ఇచ్చేందుకు ఆయన సమ్మతించారు.

2021 ఏప్రిల్ 4న రాత్రి 11గంటల ప్రాంతంలో చిలకలూరిపేటలోని విడదల రజిని ఇంట్లో గోపి చేతికి రెండు కోట్ల రూపాయల నగదు ఇవ్వగా.. తమకూ చెరో పది లక్షలు ఇవ్వాలని గోపి, జాషువా పట్టుబట్టారు. చలపతిరావు తన వ్యాపార భాగస్వామి నంబూరి శ్రీనివాసరావు, పెరవలి నాగవంశీ ద్వారా గోపికి చిలకలూరిపేటలో, జాషువాకు గుంటూరులో ఆ మొత్తం అందజేశారు. 2022లో రజిని మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ పరాజయం పాలై టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై చలపతిరావు గతేడాది సెప్టెంబరు 2న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రజిని బలవంతపు వసూళ్లు నిజమేనని అటు విజిలెన్స్ విచారణలో, ఇటు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రజిని ఒత్తిడి చేయడంతోనే తనిఖీల పేరుతో మైనింగ్ వ్యాపారులను ఇబ్బంది పెట్టినట్లు ఐపీఎస్ అధికారి జాషువా లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ (సీఐయూ).. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7ఏ తోపాటు ఐపీసీ 384, 120బీ సెక్షన్ల కింద విడదల రజిని (ఏ-1), పి.జాషువా (ఏ-2), విడదల గోపి(ఏ-3), రామకృష్ణ(ఏ-4)పై కేసు నమోదు చేసింది.
వదినకు కుడిభుజంగా..
చిలకలూరిపేట, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో విడదల రజినికి ఆమె మరిది గోపి కుడి భుజంగా వ్యవహరించారు. మొదట్లో కొంతకాలం వారి మధ్య అంత సఖ్యత లేదు. ఆ తర్వాత ఆమె వ్యవహారాలన్నీ గోపియే చూస్తూ వచ్చారు. స్టోన్ క్రషర్ యజమాని చలపతిరావును బెదిరించి రూ.2.2 కోట్లు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో జరిగిన చిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 30వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా గోపి పోటీచేసి గెలిచారు. తమ స్వస్థలమైన పురుషోత్తమపట్నంలో అప్పటి వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన అడ్డుకున్నారు. తమకు తెలియకుండా తమ గ్రామంలోకి ఎలా వస్తారంటూ ఎంపీ కారుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. శ్రీకృష్ణదేవరాయలు, రజిని మధ్య దూరం పెరగడానికి ఈ సంఘటన కూడా కారణం. అలాగే కోటప్పకొండ తిరుణాల సందర్భంగా గోపి ప్రభలపై రాజకీయ ప్రసంగం చేసి టీడీపీకి చెందిన వారిని కులం పేరుతో పేరుతో దూషించడంతో అప్పట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గోపి దూకుడు తగ్గింది. వరుసగా మూడు కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాకపోవడంతో కౌన్సిలర్‌గా ఆయన సభ్యత్వాన్ని రద్దుచేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. ఆయన్ను ఏసీబీ హైదరాబాద్‌లో అరెస్టు చేసి తాడేపల్లి కార్యాలయానికి తరలించడంతో ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులు గురువారం పురుషోత్తమపట్నం నుంచి వచ్చారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..