Kadambari Jatwani: కంచే చేను మేసినట్లు
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:26 AM
ఇంటిలిజెన్స్ మాజీ డైరెక్టర్ జనరల్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, మహిళా భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారి అయినా, కాదంబరి జత్వానీని వేధించేందుకు కుట్రపన్నారని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అతనిపై జత్వానీ కుటుంబ సభ్యులను కూడా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల్ని ఆటబొమ్మల్లా ఆడించిన పీఎ్‌సఆర్
పోలీసు అధికారి అయిఉండీ మహిళపై కుట్ర
మహిళా దర్యాప్తు అధికారికీ బెదిరింపులు
నిఘా మాజీ చీఫ్‌పై సీఐడీ రిమాండ్ రిపోర్ట్
‘‘ప్రజల భద్రత కోసం పనిచేయాల్సిన పోలీసులు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే దాన్ని వ్యక్తిగత నేరంగా చూడలేం. న్యాయవ్యవస్థపై చేసిన దాడితో అది సమానం. వ్యవస్థను నాశనం చేసే తీవ్రమైన తప్పిదానికి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్‌సఆర్ ఆంజనేయులు పాల్పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి మెప్పు కోసం పోలీసులను ఆటబొమ్మల్లా ఆడిస్తూ, కంచే చేను మేసిన చందంగా వ్యవహరించారు.’’
- రిమాండ్ రిపోర్ట్‌లో సీఐడీ తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి, విజయవాడ, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ముప్పై సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంటిలిజెన్స్ మాజీ డైరెక్టర్ జనరల్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు చట్టాన్ని ఏ కోశానా గౌరవించలేదని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. మహిళల భద్రత చూడాల్సిన పోలీసు అధికారే ఒక మహిళను వేధించేందుకు కుట్ర పన్నారన్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపుల కేసులో సీఐడీ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత జగన్ ప్రభుత్వ అరాచక పాలనలో కాదంబరి జత్వానీపై తప్పుడు కేసులు బనాయురచి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తీవ్ర వేధింపులకు పాల్పడిన కేసులో రెండో నిందితుడు పీఎ్‌సఆర్ ఆంజనేయులు. ఆయనను మంగళవారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నిఘా విభాగం అధిపతిగా తన పదవిని సీనియర్ ఐపీఎస్ దుర్వినియోగం చేశారని సీఐడీ తన రిమాండ్ రిపోర్టులో ఆరోపించింది. ఆయన త న అధికారాన్ని అడ్డు పెట్టుకుని మిగ తా పోలీసు అధికారులను ’ఆటబొమ్మలు’గా మార్చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నిరపరాధ మహిళను, ఆమె కుటుంబ సభ్యులను వేధించేందుకు కుట్ర పన్నారని రిపోర్టులో స్పష్టంగా వివరించారు. జత్వానీతోపాటు కుటుంబ సభ్యులను విజయవాడ శివారులో కొండల మధ్య నిర్మానుష్య ప్రాంతంలో బంధించి దాడి చేయించినట్లు విచారణలో తేలిందన్నారు.
ఫోర్జరీకి పీఎ్‌సఆర్ సహకారం
విజయవాడ పోలీసు కమిషనరేట్ డైరెక్షన్‌లో ఇదంతా జరగడం అత్యంత బాధాకర విషయమన్నారు. తప్పుడు కేసులో జత్వానీని, ఆమె కుటుంబ సభ్యులను ఇరికించేందుకు స్థానిక పోలీసు అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ, హన్మంతరావు తదితరులను ఆటబొమ్మల్ని చేశారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. ఈ కేసులో ఏ1 కుక్కల విద్యాసాగర్‌తో కుమ్మక్కై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడంలో ఆంజనేయులు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు. చట్టమంటే పీఎ్‌సఆర్‌కు లెక్కలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 22న విచారణకు రమ్మంటూ మహిళా దర్యాప్తు అధికారి (ఐవో) నోటీసు ఇస్తే, వచ్చేందుకు కుదరదంటూ ఈ కేసులో ఏడో నిందితుడు వెంకటేశ్వర రావుతో కబురు పెట్టారని పేర్కొన్నారు. అదే వ్యక్తి ఫోనుకు వీడియో కాల్ చేసి ‘‘నేను ఏ నేరమూ చేయలేదు. నాకు ఈ కేసుతో సంబంధం లేదు. నన్నెందుకు రమ్మంటున్నారు?’’ అంటూ ఐవోను బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది. కేసులో నిందితులు, సాక్షులపై ప్రభావితం చూపగల సత్తా పీఎ్‌సఆర్‌కు ఉందని, ఆయన బయట ఉండటం కేసు దర్యాప్తునకు తీవ్ర ఆటంకమని స్పష్టం చేసింది. ఆంజనేయులు సహ నిందితుడైన ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ మొత్తం కుట్రను బయట పెట్టారని, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పరిశీలించినప్పుడు తాడేపల్లిలోని సీఎంవోలో పీఎస్‌ఆర్ సహా నిందితులందరి ఫోన్లు ఒకేచోట ఉన్నట్లు వీరి సీడీఆర్ పరిశీలనలో తేలిందన్నారు. మొత్తం కుట్రకు బీజం వేసిన పీఎ్‌సఆర్ ఇబ్రహీంపట్నంలో జత్వానీపై కేసు నమోదుకు ముందే ముంబై పోలీసులతో మాట్లాడినట్లు తేలిందని సీఐడీ రిమాండ్ రిపోర్టులో వివరించింది. మాజీ ముఖ్యమంత్రి మెప్పు కోసం ఈ వ్యవహారంలో చేయాల్సిందంతా చేసిన ఆయన ప్రత్యేక పోలీసు బృందాలను ముంబైకి పంపారని తెలిపింది. జత్వానీ, ఆమె తల్లిని విశాల్ గున్నీ బృందం అదుపులోకి తీసుకోగా, మరో టీమ్ ఆమె తండ్రిని బలవంతంగా విజయవాడకు తీసుకొచ్చినట్లు వివరించింది. ‘ఆమెను అరెస్టు చేశాం. నేను తిరిగి రావొచ్చా?’ అంటూ పీఎ్‌సఆర్‌కు ఫోన్ చేసి గున్నీ అడిగిన విషయం కూడా నిర్ధారణ అయిందని దర్యాప్తు అధికారులు కోర్టుకు వివరించారు.
పోలీసు అధికారిపైనే మచ్చ..
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ముంబైలో నివసిస్తున్న జత్వానీ, ఆమె తల్లిదండ్రులను 2024 ఫిబ్రవరి 3న విజయవాడ డీసీపీ (అప్పట్లో) విశాల్ గున్ని నేతృత్వంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది. వారి బ్యాగులో ఒప్పంద పత్రాన్ని ఉంచినట్టు నాటకం ఆడారని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే విచారణలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదని తేలిందన్నారు. అక్రమ అరెస్టులు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోనే చోటు చేసుకున్నాయని, ఇది ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యగా పేర్కొన్నారు.
పోస్టింగ్ ఆపేస్తామని గున్నీకి హెచ్చరిక
విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీగా పనిచేసిన గున్నీ వాంగ్మూలమే ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఆయన గతేడాది సెప్టెంబరులో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు. అందులో జనవరి 31న అప్పటి ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం తాడేపల్లిలో జరిగిన సమావేశంలో పీఎ్‌సఆర్ ఆంజనేయులు తనను ముంబైకు వెళ్లి అరెస్టులు చేయాలని ఆదేశించారని, విశాఖపట్నం రేంజ్ డీఐజీగా వచ్చిన తన పోస్టింగ్‌ను నిలిపివేస్తానని హెచ్చరించారని విశాల్ గున్నీ తెలిపారు. ఫోన్ కాల్ డిటెయిల్స్ రికార్డులు కూడా ఈ కేసుకు బలమైన ఆధారంగా మారాయి. సీడీఆర్‌ఎస్, మొబైల్ టవర్ లొకేషన్ డేటా ఆధారంగా జనవరి 31న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిందితులంతా సమావేశం అయినట్టు నిర్ధారించారు. ఇవి పీఎ్‌సఆర్, విశాల్ గున్నీ, కాంతి రాణా తాతాల మధ్యన జరిగిన సంభాషణలకు సాక్ష్యంగా ఉపయోగపడినట్టు సీఐడీ అధికారులు వివరించారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం పీఎ్‌సఆర్ దర్యాప్తుకు సహకరించటం లేదు. అరెస్టు సందర్భంగా ఆయన అందించిన సమాధానాలు తిరస్కరించేలా, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. కేసు సంక్లిష్టత దృష్ట్యా, కుట్ర వెనుక ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించడానికి ఆంజనేయులును సీఐడీ కస్టడీకి తీసుకోవడం అత్యవసరమని తెలిపారు.
బెయిల్ ఇస్తే...
పీఎ్‌సఆర్ బెయిల్ మీద బయటకు వ స్తే సాక్షులను బెదిరించవచ్చునని సీఐడీ తెలిపింది. సాక్ష్యాలను నాశనం చేయవచ్చని, దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉందని పేర్కొంది. మరి కొందరు సాక్షులను విచారించాల్సి ఉందని, కొన్ని కీలక పత్రాలు సేకరించాల్సి ఉందని దర్యాప్తు అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..