Sakshi Media Scam: తెలియదు.. అవగాహన లేదు...
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:15 AM
సాక్షి ప్రకటనల వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి తుమ్మా విజయకుమార్‌రెడ్డిని మూడో రోజు కూడా ఏసీబీ విచారించింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, జీతాల రూపంలో కోట్ల రూపాయల ప్రజాధన దుర్వినియోగంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.

చివరిరోజూ మారని విజయ్‌కుమార్‌రెడ్డి తీరు
సిబ్బంది కొరతవల్లే ఔట్ సోర్సింగ్ నియామకం
గతంలోనూ అదే చేశారంటూ పలు ప్రశ్నలు దాటవేత
ముగిసిన ఏసీబీ విచారణ
గుంటూరు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి) : సాక్షి మీడియాకు నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో దోచిపెట్టిన వ్యవహారంపై నమోదైన కేసులో మూడో రోజు కూడా ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయకుమార్‌రెడ్డి తీరు మారలేదు. తెలియదు.. అవగాహన లేదంటూ చాలా ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం చేశారు. ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయనను గుంటూరు ఏసీబీ అదనపు ఎస్పీ మత్తె మహేంద్ర నేతృత్వంలోని బృందం విచారించింది. ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా ఉండగా ఆయన ఆనాడు పెద్ద సంఖ్యలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకున్నారు. ముఖ్యంగా సాక్షి, ఐ ప్యాక్ ఉద్యోగులను ఐఅండ్ పీఆర్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చూపి జీతాల రూపంలో రూ.కోట్ల ప్రజాధనం చెల్లించారని ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి సంబందించి జరిగిన అవకతవకలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించగా, ఆయన సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. గతంలో పని చేసిన వారు కూడా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకున్నారని, తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి ఉన్న ఖాళీలను తాను భర్తీ చేశానని బదులిచ్చినట్టు తెలిసింది. గతంలో ప్రభుత్వంలో ఉన్నవారు చేసిన మాదిరిగానే నాడు తానూ వ్యవహరించినట్టు చెప్పుకొచ్చారు. అంతకు మించి తనకు ఏమీ తెలియదని, దానికి సంబందించి తనకు పెద్దగా అవగాహన లేదని చెప్పినట్లు తెలిసింది. కాగా, అవసరమైతే మళ్లీ పిలుస్తామని, అప్పుడు హాజరు కావాలని విజయకుమార్ రెడ్డికి ఏసీబీ అధికారులు చెప్పి, పంపించారు. విజయకుమార్‌రెడ్డిని గుంటూరు ఏసీబీ అదనపు ఎస్పీ మత్తె మహేంద్ర తో పాటు పలువురు డిఎస్పీలు, సీఐలు విచారించారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News