Vizag Steel Staff Face Forced Retirements: విశాఖ ఉక్కులో బలవంతపు రిటైర్‌మెంట్
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:22 AM
విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులను బలవంతంగా పదవీ విరమణ (CRS)కు ప్రేరేపించే చర్యలు యాజమాన్యం చేపట్టింది. గతంలో షోకాజ్ నోటీసులు అందుకున్న 100 మందిని లక్ష్యంగా చేసుకొని, కేవలం మూడు నెలల జీతంతో రిటైర్ చేయాలనే ప్రయత్నం జరుగుతోంది

మూడు నెలల జీతం ఇచ్చి బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధం
తొలుత ఎగ్జిక్యూటివ్‌లకు... ఆ తరువాత నాన్ ఎగ్జిక్యూటివ్‌లకు
గతంలో షోకాజ్ నోటీసులు అందుకున్న వారే టార్గెట్
విశాఖపట్నం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో మొదట స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) ప్రకటించిన యాజమాన్యం ఇప్పుడు ‘తప్పనిసరి పదవీ విరమణ పథకం (సీఆర్‌ఎస్)’ అమలుకు రంగం సిద్ధం చేసింది. 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న 1200 మందికి ఇటీవల వీఆర్‌ఎస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల సంఖ్య ఇంకా తగ్గించాలని ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించడంతో ఇప్పుడు సీఆర్‌ఎ్‌సకు పదును పెట్టారు. తొలుత దీనిని ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులతో ప్రారంభిస్తున్నారు. ఆ తరువాత నాన్ ఎగ్జిక్యూటివ్‌లకు వర్తింపజేస్తారంటున్నారు. రెండేళ్ల సర్వీసు ఉన్న వారిని దీనికి ఎంపిక చేసుకున్నారు. గతంలో ఏ కారణాల వల్లనైనా రెండు షోకాజ్ నోటీసులు అందుకొని ఉంటే...వాటికి ఇప్పుడు సంజాయిషీ కోరుతున్నారు. ఆయా కారణాల వల్ల ఎందుకు సీఆర్‌ఎ్‌సపై మిమ్మల్ని తొలగించకూడదో చెప్పాలని కోరుతూ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. యాజమాన్యం తమ చర్యలను ప్రశ్నించేవారు ఎవరైనా ఉంటే వారిని ఏదో విధంగా బయటకు పంపాలని ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ విధంగా సుమారు 100 మందికి సీఆర్‌ఎస్ ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ విధంగా వెళ్లిపోయే వారికి కేవలం మూడు నెలల జీతం మాత్రమే ఇస్తారు. ఎటువంటి నష్ట పరిహారాలు రావు. గ్రాట్యుటీ, పీఎఫ్ వంటివి అందరితో పాటు వస్తాయి.
రెండో వీఆర్‌ఎస్‌కు సిద్ధం చేయడమే లక్ష్యం
ప్లాంటులో రెండో విడత వీఆర్‌ఎస్ ప్రకటన ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి విడతలో చాలామంది ఆసక్తి చూపకపోవడంతో యాజమాన్యం లక్ష్యం నెరవేరలేదు. దానిని పూర్తి చేయడానికి రెండో విడత వీఆర్‌ఎ్‌సకు ముందు సీఆర్‌ఎస్ నోటీసులతో ఉద్యోగులను భయపెడుతున్నారు. మూడు నెలల జీతంతో షోకాజ్‌లు అందుకొని వెళ్లడం కంటే గౌరవంగా వీఆర్‌ఎ్‌సతో అన్ని రకాల ప్రయోజనాలు తీసుకోవడమే మంచిదనే నిర్ణయానికి ఉద్యోగులు వచ్చేలా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ విషయాలను స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళితే.. ప్లాంటుకు సంబంధించిన ప్రతి అంశంపైనా తాము స్పందించడం సరికాదనే మాటలు వినిపిస్తున్నాయి.