Law Commission: ఆ ఇద్దరి వల్లే తొక్కిసలాట
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:38 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలేశుడి దర్శనం కోసం టీటీడీ, పోలీసు, విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పక్కా ఏర్పాట్లు చేశాయి.
ఈ ఘటనకు డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్‌రెడ్డి బాధ్యులు
ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించలేదు
టీటీడీ జేఈవో గౌతమిది కూడా వైఫల్యమే
తిరుపతి తొక్కిసలాటపై న్యాయకమిషన్ నివేదిక
ఆ ఇద్దరిపై క్రిమినల్ చర్యలకు మంత్రివర్గం నిర్ణయం
ఐఏఎస్ గౌతమిపై చర్యలు తీసుకునే బాధ్యత జీఏడీకి
అమరావతి/తిరుపతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘‘వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలేశుడి దర్శనం కోసం టీటీడీ, పోలీసు, విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పక్కా ఏర్పాట్లు చేశాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కానీ, ఇద్దరు అధికారుల వైఫల్యంతో తిరుపతిలోని పద్మావతి పార్క్ సమీపంలోని టోకెన్ జారీ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఉన్నతాధికారులు ఇచ్చిన ముందు జాగ్రత్త చర్యలను ఆ ఇద్దరు పాటించకపోవడం, విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం, తమ పరిధి కొంతే అని గిరి గీసుకొని కూర్చొని, మిగతా అంశాలను పట్టించుకోకపోవడంతో తొక్కిసలాటకు ఆస్కారం ఏర్పడింది’’ అని జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి నేతృత్వంలోని న్యాయ కమిషన్ వెల్లడించింది. ప్రభుత్వానికి ఈ నెల 10న సమర్పించిన నివేదికలో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదికను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించింది.
ఇదీ నేపథ్యం: తిరుపతిలోని పద్మావతి పార్కు వద్దనున్న రామానాయుడు హైస్కూల్‌లో 2025 జనవరి 8న ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ పరిధిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. 40మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో నాటి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమిపై బదిలీ వేటువేశారు. మరో ఇద్దరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ దుర్ఘటనపై విచారణకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తితో న్యాయకమిషన్ ఏర్పాటు చేశారు. 54మంది ప్రత్యక్ష సాక్షులు, మృతుల కుటుంబీకులు, గాయపడ్డవారు, వారి బంధువులు, పోలీసు, విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులను కమిషన్ సమగ్రంగా విచారించింది. పద్మావతి పార్క్ వద్ద గల టోకెన్ జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటకు ఇద్దరు అధికారులదే ప్రధాన బాధ్యత అని కమిషన్ అభిప్రాయపడింది. అందులో ఒకరు ఈ కేంద్రం పరిధిలో డ్యూటీలో ఉన్న డీఎస్పీ వి. రమణకుమార్ కాగా, మరొకరు ఈ కేంద్రం ఇన్‌చార్జిగా నియమించిన వేంకటేశ్వర గో సంరక్షణశాల డైరెక్టర్ హరనాథరెడ్డి. ‘‘విధి నిర్వహణలో వారు చిత్తశుద్ధితో లేరు. తమకు అప్పగించిన బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహించలేదు. దారుణ మైన తొక్కిసలాటకు వీరిద్దరే బాధ్యులని కమిషన్ భావిస్తోంది. రామానాయుడు హైస్కూల్‌లోని టోకెన్ జారీ కేంద్రం వద్ద మధ్యాహ్నం 2గంటలకు డీఎస్పీ రమణకుమార్ రిపోర్టు చేయలేదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న 70ఏళ్ల వృద్ధురాలిని పార్క్ గేటు నుంచి బయటకు పంపాలని నిర్ణయించారు. ఒక్కసారి గేటు తీస్తే ఏం జరుగుతుందో అంచనా వేయలేదు. డీఎస్పీ గేటు తీయడంతో ముందు వెళ్లాలన్న తాపత్రయంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. డాక్టర్ హరనాథ్‌రెడ్డి టోకెన్ జారీ కేంద్రానికి ఇన్‌చార్జి. భక్తుల క్యూలైన్ల నిర్వహణ, ఇతర జాగ్రత్తలేవీ తనకు సంబంధించినవి కావన్నట్లుగా వ్యవహరించారు. టోకెన్ కేంద్రాలకు ఇన్‌చార్జిగా ఉన్న టీటీడీ జేఈవో గౌతమి క్షేత్రస్థాయి పర్యవేక్షణ విషయంలో వైఫల్యం చెందారు’’ అని కమిషన్ పేర్కొంది.
ఆ ముగ్గురిపై చర్యలు
న్యాయకమిషన్ నివేదిక ఆధారంగా డీఎస్పీ వి. రమణకుమార్, వేంకటేశ్వర గో సంరక్షణశాల డైరెక్టర్ కె. హరనాథరెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఐఏఎస్ గౌతమిపై చర్యలు తీసుకునే బాధ్యతను జీఏడీకి అప్పగించారు.
ప్రభుత్వానికి సిఫారసులు
భవిష్యత్తులో తిరుమల, తిరుపతిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుడా న్యాయకమిషన్ కొన్ని సిఫారసులు చేసింది.
భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయా లు, వనరులను మరింతగా పెంపొందించాలి.
టోకెన్ల జారీకి, భారీ రద్దీని నియంత్రించేందుకు, వీఐపీల దర్శనాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకోవాలి.
దైవదర్శనానికి వచ్చే భక్తుల క్యూలైన్లను నిర్వహించడం, రద్దీ నియంత్రణలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.
న్యాయ కమిషన్ చేసిన సిఫారసులపై అధ్యయనం చేయాలని దేవదాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News