ఐదేళ్ల లీజు ప్రతిపాదన తిరస్కరణ!
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:43 AM
గత వైసీపీ ప్రభుత్వంలో తక్కువ ధరకే దుర్గగుడిపై అగరుబత్తిలు, దూప్ స్టిక్స్ విక్రయ లైసెన్సు పొందిన సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్ల లీజు పొడిగింపునకు దరఖాస్తు చేసుకుంది. గత ఈవో రామారావు హయాంలో ఎన్‌ఎంఆర్ ఉద్యోగి చక్రం తిప్పి సదరు ప్రతిపాదనల ఫైల్‌ను దేవదాయశాఖకు చేర్చారు. దేవస్థానం లీజుల విభాగంపై దృష్టి సారించిన ప్రస్తుత ఈవో, దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తాజాగా ఈ ఫైల్‌ను తిరస్కరించడం దుర్గగుడిలో చర్చనీయాంశంగా మారింది.
-దుర్గగుడిలో అగరుబత్తి, దూప్ స్టిక్స్ విక్రయ లైసెన్స్‌పై కమిషనర్ నిర్ణయం
-మరో మూడు నెలల్లో ముగియనున్న లీజు గడువు
-గత వైసీపీ హయాంలో తక్కువ అద్దెకు షాపు కేటాయింపు
- ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్ల లీజుకు ప్రతిపాదనలు
- ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన ఎన్‌ఎంఆర్ ఉద్యోగి
గత వైసీపీ ప్రభుత్వంలో తక్కువ ధరకే దుర్గగుడిపై అగరుబత్తిలు, దూప్ స్టిక్స్ విక్రయ లైసెన్సు పొందిన సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్ల లీజు పొడిగింపునకు దరఖాస్తు చేసుకుంది. గత ఈవో రామారావు హయాంలో ఎన్‌ఎంఆర్ ఉద్యోగి చక్రం తిప్పి సదరు ప్రతిపాదనల ఫైల్‌ను దేవదాయశాఖకు చేర్చారు. దేవస్థానం లీజుల విభాగంపై దృష్టి సారించిన ప్రస్తుత ఈవో, దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తాజాగా ఈ ఫైల్‌ను తిరస్కరించడం దుర్గగుడిలో చర్చనీయాంశంగా మారింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారికి, ఇతర ఉపాలయాల్లో స్వామివార్లకు ఉపయోగించిన పూల నుంచి అగరుబత్తిలు, దూప్ స్టిక్స్ తయారు చేసి విక్రయించేందుకు వీలుగా రాజమండ్రికి చెందిన ఓ సంస్థకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లకు లీజుకు ఇచ్చారు. సదరు సంస్థ దేవస్థానంలోనే విక్రయ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ లీజు గడువు ముగియక ముందే ఈవో రామారావు హయాంలో లీజుగడువును మరో ఐదేళ్లు పొడిగింపునకు ప్రతిపాదిస్తూ అప్పట్లో ఫైల్‌ను దేవదాయశాఖకు పంపారు. ప్రస్తుతం సదరు సంస్థ లీజు ముగియటానికి మరో మూడు నెలల గడువు మాత్రమే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లకు గడువు పెంపుదల ప్రతిపాదన వ్యవహారంలో లీజుల విభాగంలో ఓ ఎన్‌ఎంఆర్ ఉద్యోగి చక్రం తిప్పారని సమాచారం. అధికారులందరినీ పక్కన పెట్టి ఎన్‌ఎంఆర్ ఉద్యోగి తానొక్కడే గడువు పెంపునకు ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తోంది. సంబంధిత లీజు సంస్థకు ఎన్‌ఎంఆర్ ఉద్యోగే ఉచిత సలహా ఇచ్చి దరఖాస్తు పెట్టించాడని సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా రెండేళ్ల లీజును ఏకంగా ఐదేళ్లకు ప్రతిపాదిస్తూ ఫైల్‌ను సిద్ధం చేశారు. ఈ ఫైల్‌ను సిద్ధం చేయటం వెనుక రూ.10 లక్షల డీల్ నడిచిందని సమాచారం.
అనుమానాలెన్నో..
ఈ లీజు పెంపు ప్రతిపాదన వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. నెలకు రూ.1.60 లక్షల అద్దె ప్రాతిపదికన ఆ సంస్థకు దేవస్థానంలో స్టాల్ అప్పగించటం జరిగింది. ద్వారకా తిరుమలలో ఇదే సంస్థ రూ.1.80 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయంగా ఉన్న ఇంద్రకీలాద్రిపై తక్కువ అద్దెకు స్టాల్ కేటాయింపుపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. అగరబత్తి ప్యాకెట్ ధర రూ.100గా నిర్ణయించి విక్రయిస్తున్నారు. అగరుబత్తి కొన్న వారికి ఒక కీ చైన్‌ను కూడా బహుమతిగా ఇస్తున్నారు. తక్కువ అద్దెతో ఐదేళ్లు లీజు పొడిగించుకోవటం ద్వారా భారీగా ఆదాయం పొందేందుకు పావులు కదిపింది. అయితే సదరు సంస్థ అమ్మవారి ఆలయంలో వాడిన పూలతోనే అగరబత్తిలను తయారు చేయిస్తుందా అన్నదానిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం నుంచి పువ్వులు తీసుకోవటం లేదని, రసాయనాలతో తయారు చేసిన అగరబత్తిలనే విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దేవదాయశాఖ కమిషనర్ లీజు గడువు ఐదేళ్లకు పెంపు ప్రతిపాదనను రద్దు చేసినట్టు తెలుస్తోంది.
లీజుల విభాగంపై ఈవో దృష్టి
దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రస్తుతం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా కూడా వ్యవహరిస్తుండటంతో లీజుల విభాగంపై దృష్టి సారించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా కూడా విచారణ జరిపినట్టు తెలిసింది. సూపరింటెండెంట్‌కు తెలియకుండానే ప్రతిపాదన సిద్ధమైనట్టు వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో వేళ్లన్నీ ఎన్‌ఎంఆర్ ఉద్యోగివైపే చూపిస్తున్నాయి. లీజుల విభాగంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఎన్‌ఎంఆర్ ఉద్యోగి కాంట్రాక్టర్లతో అత్యంత సన్నిహితంగా ఉంటాడని సమాచారం. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా ఉచిత సలహాలు ఇస్తాడన్న విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించే సలహాలు ఇవ్వటం ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. సదరు ఉద్యోగిపై ప్రస్తుత ఈవో దృష్టికి ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తోంది.