AP NGO Association: ఉద్యోగుల గౌరవం కోసం పోరాటం
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:52 AM
ఉద్యోగుల ప్రయోజనాలు సాధించే విషయంలో ఎట్టి పరిస్థితులలో రాజీ పడబోమని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ స్పష్టం చేశారు
ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్
గుంటూరు(తూర్పు), జూలై 29(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ప్రయోజనాలు సాధించే విషయంలో ఎట్టి పరిస్థితులలో రాజీ పడబోమని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు ఏపీ ఎన్‌జీవో సంఘ సాంస్కృతిక సమావేశ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ...ఉద్యోగులకు రావల్సిన జీపీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ, సరెండర్ లీవ్ బకాయిలను కొంత మేరకు కూటమి ప్రభుత్వం చెల్లించిందని మిగతా వాటిని సాధించేందుకు రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తోందన్నారు. బకాయిలు కంటే ఉద్యోగుల గౌరవం కోసం సంఘం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. జీపీఎఫ్, సరెండర్ లీవులు, ఈహెచ్‌ఎస్ ఇతర సేవలు కింద రూ. 1850 కోట్ల కోసం ప్రతి ఏడాది ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్ధితి మారాలన్నారు. గత బకాయిలను తొలి దశలో దాదాపు రూ. 7వేల కోట్లను విడుదల చేయటం, పెన ్షనర్లకు అదనపు క్యాంటమ్ పెన్షన్ ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాలు హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ ఉద్యోగ నాయకుల సమష్టి కృషితో తాము ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు సాధించుకుంటామని చెప్పారు. తొలుత భవనాన్ని స్థ్ధానిక ఎమ్మెల్యే నసీర్ అహమద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు.