Share News

Fearsome Lady Don: ఖాకీనే వణికించే కిలేడీ

ABN , Publish Date - Aug 16 , 2025 | 03:16 AM

ఆమె ఒక లేడీ డాన్‌ ఆర్థిక లావాదేవీల్లో తల దూర్చడం, యూత్‌ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేయడం, ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ పైరవీలు చేయడం..

Fearsome Lady Don: ఖాకీనే వణికించే కిలేడీ

రాష్ట్ర సచివాలయంలోనూ హల్‌చల్‌

  • అత్యున్నత అధికారుల పేర్లతో పైరవీలు

  • వైసీపీ హయాంలో మొదలైన ఆమె ‘దిశ’

  • కూటమి వచ్చాక ఆరునెలలు సైలెన్స్‌

  • ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్న లేడీ డాన్‌

  • మూడు జిల్లాల పోలీసులకు హడల్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఆమె ఒక లేడీ డాన్‌! ఆర్థిక లావాదేవీల్లో తల దూర్చడం, యూత్‌ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేయడం, ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ పైరవీలు చేయడం.. అలా అలా ఒక హైప్రొఫైల్‌ ‘లేడీ’గా మారింది. ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే కూర్చుని హల్‌చల్‌ చేసే స్థాయికి ఎదిగింది. నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు రాష్ట్రంలోనే అతి పెద్ద అధికారులతో పని చేయిస్తా అంటూ ఫోన్లు చేసి బేరాలు పెడుతోంది. నెల్లూరు జిల్లాలో ఆ మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, క్రిమినల్స్‌ అరుదు. తప్పుడు పనులు వద్దని వారించిన భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కేసు లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి బదిలీ అయ్యారు. గతంలో ఒక ఎస్పీతో కలిసి ఆమె గోవా ట్రిప్పు వెళ్లింది. అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించిన ఆ మహిళ దశ వైసీపీ ప్రభుత్వంలో ‘దిశ’తో ఎక్కడికో మారిపోయింది. నెల్లూరులో తనకు తాను మార్కెటింగ్‌ చేసుకుని, పోలీసు పరిచయాలు పెంచుకుని ఎదిగేందుకు ఎన్ని దారులుంటాయో అన్నీ ఎంచుకుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగింది. గత ప్రభుత్వంలో తాడేపల్లికి తరచూ వచ్చి వెళ్తూ పెద్దల్ని కలిసి ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం చేసుకుంది. ఆమె ఏకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూర్చుని.. ‘మీకు ఏమి కావాలో చెప్పండి. నేను చెబితే మీ ఎస్పీ చేయాల్సిందే. అన్నీ నేను చూసుకుంటా’ అంటూ సీఐలు, ఎస్‌ఐలనే కమాండ్‌ చేసే స్థాయికి చేరింది. వైసీపీ పెద్దలతో పరిచయాలు పెట్టుకుని రెచ్చిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్నెళ్ల పాటు మౌనంగా ఉంది. గత కొన్ని నెలలుగా మళ్లీ విజృంభిస్తోంది.


పోలీసులకే బెదిరింపులు

ఆ మహిళ వైసీపీ ప్రభుత్వంలో ‘దిశ’ యాప్‌ను ఆసరాగా ఎంచుకుని పోలీసులతో పరిచయాలు పెంచుకుంది. ‘దిశ’ ప్రచారకర్తగా పోలీసుల చుట్టూ తిరిగింది. ఇదే క్రమంలో... రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ పోలీసులనే ఆటాడుకుంటూ సెటిల్మెంట్లు చేస్తుందని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల పోలీసులు చెబుతున్నారు. గంజాయి బిజినెస్‌ నడుపుతోందని పేర్కొంటున్నారు. ఆమె నివాసానికి వచ్చే బైకులు, కార్లకు నెంబర్లు కూడా ఉండవు. కొందరు పోలీసులు ఆమెపై కేసులు పెట్టి రౌడీ షీట్‌ తెరవాలని చూశారు. కానీ... ఆమె తన పలుకుబడితో ఆపించుకుంది. మొగ్గ దశలోనే తుంచాల్సిన ఈ గంజాయి మొక్కనుఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు ఇప్పుడు మూడు జిల్లాల్లో వనంలా తయారు చేశారు. ఇప్పుడు.. మూడు జిల్లాల పోలీసుల్ని ఆమె చిటికెలేసి ఆడిస్తోంది. ఎస్‌ఐను బ్లాక్‌ మెయిల్‌ చేసి భారీగా డబ్బులు గుంజడం, సీఐని జిల్లా నుంచే బదిలీ చేయించడం, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డీఎస్పీని వీఆర్‌కు పంపడం, జైలు సూపరింటెండెంట్‌ను రోడ్డు పాలు చేసి ఖాకీ యూనిఫామ్‌కు సైతం చెమటలు పట్టించిన కిలాడీ లేడీ ఆమె.

ఖైదీకి పెరోల్‌ వెనుకా ఆమే..

రెండు జిల్లాల పోలీసులు, నెల్లూరు సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ వద్దన్నా యావజ్జీవ ఖైదీకి పెరోల్‌ రావడాన్ని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పెరోల్‌ వెనుక ఉన్నదీ ఈ మహిళే అని తెలుస్తోంది. ఆమెకు అడ్డుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల లెక్క తేల్చేందుకే.. జైల్లో ఉన్న ఓ వ్యక్తిని పెరోల్‌పై బయటకు తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఖైదీ బయటకు వస్తే మూడు జిల్లాల్లో హత్యలు జరిగే అవకాశం ఉందంటూ ఆయా జిల్లాల ఎస్పీలు నివేదికలు ఇచ్చినా ఆ వ్యక్తికి పెరోల్‌ లభించిందంటే... ఆమె ఏ స్థాయిలో చక్రం తిప్పుతోందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Aug 16 , 2025 | 03:16 AM