Share News

బర్డ్‌ఫ్లూ భయం

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:52 AM

బర్డ్‌ఫ్లూ భయం ఉమ్మడి కృష్ణాజిల్లాను వణికిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆయా జిల్లాల నుంచి కోళ్లు, కోడిగుడ్లు దిగుమతి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పది రోజుల పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలాజీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బర్డ్‌ఫ్లూ ప్రభావం మాంసం దుకాణాలు, కోడి గుడ్ల వ్యాపారులపై పడింది. కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. బర్డ్‌ఫ్లూ నుంచి కోళ్లను కాపాడుకునేందుకు పౌల్ర్టీఫామ్‌ యజమానులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

బర్డ్‌ఫ్లూ భయం

- ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ

- ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు అప్రమత్తం

- పొరుగు జిల్లాల నుంచి కోళ్లు, కోడిగుడ్లు దిగుమతి కాకుండా జాగ్రత్తలు

- పదిరోజుల పాటు అప్రమత్తంగా ఉండాలన్న కృష్ణా కలెక్టర్‌ బాలాజీ

- పడిపోయిన చికెన్‌, కోడిగుడ్ల ధరలు, విక్రయాలు

బర్డ్‌ఫ్లూ భయం ఉమ్మడి కృష్ణాజిల్లాను వణికిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆయా జిల్లాల నుంచి కోళ్లు, కోడిగుడ్లు దిగుమతి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పది రోజుల పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలాజీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బర్డ్‌ఫ్లూ ప్రభావం మాంసం దుకాణాలు, కోడి గుడ్ల వ్యాపారులపై పడింది. కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. బర్డ్‌ఫ్లూ నుంచి కోళ్లను కాపాడుకునేందుకు పౌల్ర్టీఫామ్‌ యజమానులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం/విజయవాడ:

జిల్లాలోని చల్లపల్లి, మొవ్వ, మోపిదేవి, ఘంటసాల, పెదపారుపూడి తదితర ప్రాంతాల్లో పౌల్ర్టీఫామ్‌లు ఉన్నాయి. వీటిలో 36 లక్షల లేయర్‌, బ్రాయిలర్‌ కోళ్ల పెంపకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ ఎన్‌సీహెచ్‌.నరసింహులు తెలిపారు. బర్డ్‌ ఫ్లూ సోకుతుందనే కారణంతో చికెన్‌, కోడిగుడ్లను కొనుగోలు చేసేందుకు, తినేందుకు ప్రజలు జంకుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ సోకినట్లుగా రుజువు కావడంతో జిల్లాపైనా ఈ ప్రభావం పడుతుందనే భయం పౌల్ర్టీ యాజమానులను వెంటాడుతోంది.

అధికార యంత్రాంగం అప్రమత్తం

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పౌలీ్ట్రఫామ్‌లలో అధిక సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో వీటి నమూనాలను భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డీసీజెస్‌ ల్యాబ్‌కు పంపారు. అక్కడ నుంచి వచ్చిన నివేదికలో బర్డ్‌ఫ్లూగా నిర్ధారించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణాజిల్లాకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కోళ్లు, కోడి గుడ్లు అధికంగా దిగుమతి అవుతూ ఉంటాయి. ఆ జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవద్దని, కోళ్లను, కోడిగుడ్లను రవాణా చేసే వాహనాలను కూడా జిల్లాలో ప్రవేశించకుండా నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ బాలాజీ మంగళవారం అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చెక్‌ పోస్టుల వద్ద నిఘా ఉంచడంతోపాటు అనుమానిత చికెన్‌ షాపులలో తనిఖీలు కూడా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కోళ్ల ఫారాల వద్ద అధికసంఖ్యలో కోళ్లు చనిపోతుంటే అక్కడి నుంచి నమూనాలు సేకరించి ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా వైద్య, పశుసంవర్థకశాఖతో పాటు ఇతర విభాగాల అధికారులను ఆదేశించారు. బర్డ్‌ఫ్లూ సోకిన కోడి మాంసం, కోడిగుడ్లు తింటే మనుషులకు ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పొరుగు జిల్లాల నుంచి కోళ్లు, కోడిగుడ్లు జిల్లాకు తరలించకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

రెండు నెలల కిందట మోపిదేవిలో చనిపోయిన కోళ్లు

రెండు నెలల కిందట మోపిదేవి మండలంలోని కప్తానుపాలెంలోని పౌల్ర్టీఫామ్‌ల్లో అధిక సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. నాటు కోళ్లు కూడా చనిపోవటంతో వాటి శాంపిళ్లను జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఆ తర్వాత వాటి వివరాలను బయటకు వెల్లడించలేదు. అప్పటి నుంచి జిల్లాలోని అన్ని పౌలీ్ట్ర ఫామ్‌లను పశుసంవర్థకశాఖ అధికారులు తరచుగా పరిశీలిస్తూ బర్డ్‌ఫ్లూ సోకకుండా కోళ్లకు వాక్సినేషన్‌ వేయడం, పౌల్ర్టీఫామ్‌ల వద్ద తీసుకోవాల్సిన పారిశుధ్య చర్యలు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

పడిపోయిన కోడి మాంసం విక్రయాలు

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని చికెన్‌ దుకాణాలకు కోళ్లు కంచికచర్ల, నందిగామ, నూజివీడు, ఏలూరు, నరసరావుపేటతోపాటు తెలంగాణ ప్రాంతాల నుంచి వస్తాయి. బర్డ్‌ఫ్లూ మాంసం వ్యాపారంలో భిన్న పరిస్థితులను చూపిస్తోంది. అమ్మకాలు తగ్గిపోయి వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతుంటే పౌలీ్ట్రలు మాత్రం కోళ్ల ధరలను పెంచుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 2 వేల నుంచి 3 వేల వరకు కోడిమాంసం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణంలో సీజన్‌లో రోజుకు 20 నుంచి 30 కోళ్లను కోస్తారు. అదే ఆదివారం రోజున 150 కోళ్ల వరకు కోస్తారు. బర్డ్‌ఫ్లూ ప్రభావంతో రోజుకు పది కోళ్లకు మించి కోయలేకపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం రోజున దారుణంగా 70 కోళ్లకు కోతలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడిమాంసం అమ్మకాలు తగ్గిపోవడంతో గుడ్డు ధరలు క్రమంగా పతనమవుతున్నాయి. కోడిగుడ్డు ధర కొద్దిరోజుల కిందటి వరకు ఏడు రూపాయలు పలికేది. ఇప్పుడు అది కాస్త ఐదు రూపాయలకు పడిపోయింది.

అమ్మకాలు తగ్గినా.. ధర అక్కడే!

బర్డ్‌ఫ్లూ ప్రభావంతో కోడిమాంసం అమ్మకాలు పడిపోతుండగా, కోడి ధర మాత్రం తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. ప్రస్తుతం కిలో కోడిమాంసం స్కిన్‌లెస్‌ రూ.240 ఉంది. కొద్దిరోజుల కిందటి వరకు ఇది రూ.200 ఉండేది. స్కిన్‌తో ఇప్పుడు రూ.230 పలుకుతోంది. కోడిమాంసం దుకాణాలకు వచ్చే కోళ్ల ధరలను పౌలీ్ట్రలు క్రమంగా పెంచుతున్నాయి. పౌలీ్ట్రల నుంచి కోడిమాంసం దుకాణాలకు వచ్చే కోడి కిలో రూ.100 ఉండేది. రెండు రోజుల నుంచి ఈ ధర పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు కిలో కోడి ధర రూ.125 పలుకుతోంది. బర్డ్‌ఫ్లూ ప్రభావంతో రూ.25 ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

తగ్గిన కోడిగుడ్డు ధరలు

బర్డ్‌ఫ్లూ ప్రభావం ఇక్కడ లేదు. అయినా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. కోళ్లకు వాక్సిన్‌లు వేయించాం. ఐదేళ్ల కిందట బర్డ్‌ఫ్లూ రావడంతో నష్టాలు చవిచూశాం. ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ వచ్చిందనే ప్రచారంతో కోడిగుడ్ల ధరలు పడిపోయాయి. డిసెంబరులో రూ.6.30 ధర ఉంటే నేడు రూ.5.50లకు, అంతకుమించి పడిపోయింది.

-తుమ్మల రామకృష్ణ, ఘంటసాలపాలెం, ఘంటసాల మండలం

బ్రాయిలర్‌ కోళ్ల విక్రయాలు తగ్గాయి

బర్డ్‌ఫ్లూ సోకిందనే ప్రచారంతో బ్రాయిలర్‌ కోళ్ల విక్రయాలు తగ్గాయి. చికెన్‌, కోడిగుడ్లు కొనేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. మోపిదేవిలో ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవు. బర్డ్‌ ఫ్లూ సోకుతుందనే ప్రచారంతో ఫౌల్ర్టీఫాం యజమానులు నష్టాలు చవిచూసే సూచనలు కనిపిస్తున్నాయి.

-కొల్లి హేమగణేష్‌, శివరామపురం, మోపిదే వి మండలం

జిల్లాలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవు

జిల్లాలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆ జిల్లాల నుంచి కోళ్లు, కోడిగుడ్లు దిగుమతి కాకుండా నిఘా ఉంచాం. కోడి మాంసం దుకాణాలను కూడా పరిశీలిస్తున్నాం ఇతర జిల్లాల నుంచి తక్కువ ధరకు కోళ్లను దిగుమతి చేసుకోకుండా చూస్తున్నాం. బర్డ్‌ఫ్లూ సోకకుండా పౌల్ర్టీ యజమానులు ఇప్పటికే కోళ్లకు వ్యాక్సినేషన్‌ చేయించారు. వలస పక్షులు కోళ్లఫామ్‌ల పక్కనే ఉన్న చెట్లపై వాలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం.

-ఎన్‌సీహెచ్‌.నరసింహులు, జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌

Updated Date - Feb 12 , 2025 | 12:52 AM