Kolusu Parthasarathi: రైతు పరామర్శ ర్యాలీనా.. విధ్వంస ర్యాలీనా
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:00 AM
జగన్ మీడియాలో డిబేట్ల పేరుతో మహిళల్ని అవమానించారంటూ పొదిలిలో మహిళలు నిరసన చేస్తుంటే వారిపై రాళ్లు, చెప్పులతో దాడి చేయిస్తారా? అని మంత్రి కొలుసు పార్ధసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొదిలి ఘటనలో వైసీపీ తీరును ఎండగట్టిన మంత్రి పార్ధసారథి
అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): జగన్ మీడియాలో డిబేట్ల పేరుతో మహిళల్ని అవమానించారంటూ పొదిలిలో మహిళలు నిరసన చేస్తుంటే వారిపై రాళ్లు, చెప్పులతో దాడి చేయిస్తారా? అని మంత్రి కొలుసు పార్ధసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిలిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా రాసుకొచ్చిన ప్లకార్డులను.. మహిళలు, పోలీసులపైకి వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుతున్న వీడియోలను ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్.. తన వెంట వచ్చిన వారి వద్ద ఉన్న ప్లకార్డులను పరిశీలించారా? అని మంత్రి ప్రశ్నించారు. ‘రైతులను పరామర్శించడానికి వెళితే.. గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు న్యాయం చేయాలి, పొగాకు రైతులను కాపాడాలి అన్న నినాదాలున్న ప్లకార్డులు పట్టుకుంటారు. కానీ, ఎవరైనా సరే రండి తొక్కిపడేస్తాం అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. పొదిలిలో జగన్ చేసింది రైతు పరామర్శ ర్యాలీలా లేదు. విధ్వంసం సృష్టికి చేసిన ర్యాలీలా ఉంది’ అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై దాడులు చేయడమే కాకుండా వారిని రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, రైతుల సమస్యలపై జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి వారి సమస్యలను ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. వైసీపీ వారే నేర రాజకీయాలు చేస్తూ మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వం శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విధ్వంసకర రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులెవ్వరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.