Indian Migrant Worker: ఖతర్‌లోనే తనకల్లు వాసి మృతదేహం
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:42 AM
ఖతర్‌లో ఆత్మహత్య చేసుకున్న నూరుల్లా మృతదేహం కోసం అతని కుటుంబం ఎదురు చూస్తోంది. మృతదేహాన్ని పంపాలంటే
పంపేందుకు డబ్బులు అడుగుతున్న యజమాని
ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం వినతి
తనకల్లు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఖతర్‌లో ఆత్మహత్య చేసుకున్న నూరుల్లా మృతదేహం కోసం అతని కుటుంబం ఎదురు చూస్తోంది. మృతదేహాన్ని పంపాలంటే ఏడు వేల రియాల్స్ ఇవ్వాలని అక్కడి యజమాని కపిల్ డిమాండ్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లుకు చెందిన నూరుల్లా(36), మూడేళ్ల క్రితం ఖతర్ వెళ్లారు. అక్కడ కపిల్ అనే వ్యక్తి వద్ద డ్రైవర్‌గా పనిచేసేవారు. గత నెల 31న నూరుల్లా ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను బాధితులు ఆశ్రయించారు. ఎమ్మెల్యే చొరవతో సీఎంఓ అధికారులు తమతో మాట్లాడారని తెలిపారు. తొలుత సొంత ఖర్చులతో మృతదేహాన్ని పంపుతానని యజమాని చెప్పారని, ఇప్పుడు ఏడు వేల రియాల్స్ (సుమారు రూ.1.60 లక్షలు) అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే అక్కడే అంత్యక్రియలు నిర్వహించి, తమకు రూ.50 వేలు పంపుతామని అంటున్నారని తెలిపారు. ప్రభుత్వం చొరవచూపి, మృతదేహాన్ని తెప్పించాలని నూరుల్లా భార్య షాజార్ విజ్ఞప్తి చేశారు.