Share News

Chandrababu Naidu cases closed: బాబుపై ‘అంగళ్లు’ కేసుల మూసివేత

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:26 AM

2023లో అంగళ్లులో చంద్రబాబుపై బనాయించిన హత్యాయత్నం సహా నాలుగు కేసులు తప్పుడు ఫిర్యాదులేనని విచారణలో తేలడంతో పోలీసు శాఖ వాటిని మూసివేసింది. వైసీపీ నేతల ప్రేరణతో అప్పట్లో ఈ కేసులు నమోదు చేసినట్టు తాజాగా కోర్టుకు నివేదించారు.

Chandrababu Naidu cases closed: బాబుపై ‘అంగళ్లు’ కేసుల మూసివేత

నాడు వైసీపీ మూకల రాళ్ల దాడి.. పైగా ఆయనపైనే హత్యాయత్నం సహా 4 తప్పుడు కేసులు

దేవినేని, అమరనాథ్‌రెడ్డి సహా 20 మంది క్రియాశీల నేతలపైనా బనాయింపు

కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయి విచారణ

తప్పుడు కేసులని పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ

వాటిని మూసివేస్తున్నట్లు కోర్టుకు వివరాల సమర్పణ

రాయచోటి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అన్నమయ్య జిల్లా అంగళ్లులో అక్రమంగా బనాయించిన కేసులను పోలీసులు మూసివేశారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనపై చేసినవి తప్పుడు ఫిర్యాదులుగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు నివేదించినట్లు తె లిసింది. ప్రతిపక్ష నేత హోదాలో 2023 ఆగస్టు 9న చంద్రబాబు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చారు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి వర్గీయులు అడుగడుగునా ఆయన పర్యటనను అడ్డుకున్నారు. అప్పటి పోలీసుల సహకారంతో..వందల మంది వైసీపీ మూకలు కురబలకోట మండలం అంగళ్లు సర్కిల్‌లో నడిరోడ్డుపై బైఠాయించారు. టీడీపీ వర్గీయులపై యథేచ్ఛగా రాళ్లదాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు దెబ్బలు తగిలాయి. చంద్రబాబుపైకీ రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి అడ్డుకోవడంతో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదు. అయితే ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్న చంద్రబాబుకు వినతిప్రతం ఇచ్చేందుకు తాము వెళ్తుంటే.. టీడీపీ నాయకులు తమపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని, చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఈ దాడులు జరిగాయని వైసీపీ ముఖ్యనాయకుడు ఉమాపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దీంతో అప్పట్లో ముదివేడు పోలీసులు చంద్రబాబుపై ఏకంగా హత్యాయత్నం (307) సహా పలు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లతో (క్రైం నంబర్లు 79/2023, 74/2023, 75/2023, 76/2023) నాలుగు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, అమరనాథ్‌రెడ్డి సహా 20 మంది క్రియాశీల టీడీపీ నాయకులపైనా కేసులు పెట్టారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో కొందరు పోలీసులు.. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలకు చెందిన వందల మంది క్రియాశీల టీడీపీ నాయకులు, కార్యకర్తలను కూడా ఈ కేసుల్లో ఇరికించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ఈ సంఘటన పూర్వాపరాలను పూర్తి స్థాయిలో విచారించారు. చంద్రబాబు పర్యటనను వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే కాకుండా.. ఆయనపై రాళ్లు రువ్వినట్లు కూడా గుర్తించారు. దాడులకు దిగిన వారిపై కేసులు నమోదు చేయకపోగా.. ఆయనపైన, ఇతర టీడీపీ నాయకులపైప అక్రమ కేసులు బనాయించినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై బనాయించిన హత్యాయత్నం కేసుతో పాటు.. మిగిలిన మూడు కేసులూ తప్పుడువేనని తేల్చారు. వాటిని మూసివేస్తూ కోర్టుకు వివరాలు సమర్పించినట్లు సమాచారం.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 04:26 AM