Bheemili Beach: నేహారెడ్డి అక్రమ నిర్మాణాల పరిశీలన
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:41 AM
భీమిలి బీచ్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలతో పర్యావరణ నష్టంపై అంచనా వేసేందుకు నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది.
భీమిలి బీచ్‌లో పర్యటించిన కమిటీ.. త్వరలో హైకోర్టుకు నివేదిక
విశాఖపట్నం, జూలై 25(ఆంధ్రజ్యోతి): భీమిలి బీచ్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలతో పర్యావరణ నష్టంపై అంచనా వేసేందుకు నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. శుక్రవారం బీచ్‌లో పర్యటించిన బృందం ఆ అక్రమ నిర్మాణాలు, తొలగించిన ప్రాంతాలను పరిశీలించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎం.శ్రీరామకృష్ణ, తీర ప్రాంత నిర్వహణ సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వీవీఎస్ శర్మ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ పీవీ ముకుందరావు, కేంద్ర పర్యావరణ విభాగం శాస్త్రవేత్త దుప్పల సౌమ్య, అదే శాఖకు చెందిన శాస్త్రవేత్త సీహెచ్ మురళీకృష్ణ ఈ బృందంలో ఉన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ వేసిన మూర్తియాదవ్ నుంచి వివరాలు సేకరించారు. సమగ్ర సమాచారంతో పర్యావరణ నష్టాన్ని అంచనా వేసి, దానికి ఎంత మొత్తం వసూలు చేయాలో సూచిస్తూ హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ కొన్నాళ్ల కిందట హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)ని ఆదేశించింది. అక్రమ నిర్మాణాల ఫలితంగా తీరప్రాంత పర్యావరణానికి ఏమేరకు నష్టం వాటిల్లిందో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పర్యావరణానికి నష్టం చేకూర్చారంటూ నేహారెడ్డి, ఆమె భర్త రోహిత్‌రెడ్డి, అవ్యాన్ రియల్టర్స్‌పై భీమిలి పోలీస్ స్టేషన్‌లో పీసీబీ అధికారులు కేసు పెట్టారు.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News